అభిమానులారా ఏకంకండి!

డిసెంబర్ 2009 ‘కవితా’ పత్రికలో శ్రీతనికెళ్ల భరణిగారి రచన.

‘నవ రసావిత్రి’త్రికాలాలకి అతీతమైన
త్రివిక్రమ స్వరూపం
నటరాజుకి స్త్రీరూపం
సావిత్రి……
సావిత్రి కొంగు
నిర్మాతలకు బంగారం.
ఆవిడ కన్యాశుల్కంలో నవ్వితే
మధురవాణే డంగై పోయింది!
మాయాబజార్ లో
ఘటోత్కచుణ్ణి అనుకరిస్తే
రంగారావే కంగారు పడ్డాడు!!
ఆమె నాయికైతే
ప్రేక్షకుడే నాయకుడు
ఆమె చెల్లి అయితే
ప్రేక్షకుడే అన్న
ఆమె పార్వతైతే
ప్రేక్షకులంతా దేవదాసులే
కోమాలో ఆమెను చూస్తే
పాడుబడ్డ బావిలో
తేలే చందమామలాగా….
పతనమైన విజయనగర
సామ్రాజ్య వైభవంలాగా…
శిధిలమైన వేయి స్తంభాల
గుడిలాగా….
ఓడరేవులో లైట్లారిపోయిన
ఒంటరి దీపస్తంభంలాగా
ఉండేది!!!
‘న భూతో న భవిష్యతి ’
ఒక్క సావిత్రికే ఈ వాక్యం వాడొచ్చు.

శ్రీమతి పాలపర్తి ఉమాదేవి, శ్రీనగర్ కాలని, హైదరాబాదు , గారి రచన

అభినేత్రి సావిత్రి,
అభినయ మంత్ర గాయత్రి సావిత్రి,
ఆకర్ణాంత విశాలనేత్రి, ఆఖిలాంధ్ర ప్రేక్షక హృదయాధి నేత్రి ,
ఒక్కింత బొద్దుగా, మరికాస్త ముద్దుగా,
మురిపంచి, మరపించు మా యింతి సావిత్రి.
చేల గీట్ల వెంట స్వేచ్ఛగా ఎదిగిన
ముద్ద బంతిగ తోచు, మా ముగ్ధ సావిత్రి.
కోటి భావాల ఘరులు నీ కనుల కాసారాలు,
నవరసమ్ములు వోలుకు నీ నేత్రాంచలాలు,
అధరమ్ము విరుపులో ఎన్నెన్ని మధురిమలో,
ఆ చిన్ని నవ్వులో ఎన్నెని కళలో.
అరనవ్వు, చిరునవ్వు, అట్టహాసపు నగవు,
లొట్టి పిట్టల నగవు మా మధుర వాణికె సోబగు,
పల్లె పిల్ల పార్వతిగ పరుగులే తీసినా,
ప్రౌఢ జమిందారిణిగ హుందాగ మెలగినా,
చిలిపిగా శ్రీవారి నాట పట్టించినా,
జాణ మధురవాణిగ మీరులు తా కొల్పినా,
బెత్తమ్ము చేబూని పాఠాలు నేర్పినా,
విరహిణగ తామారి తాపమ్ము చెందినా,

విరహిణిగ తామారి తపమ్ము చెందినా,
కౌరవుల శాసించు రుద్ర ద్రౌపదియైనా,
ఆమెకామెయెసాటి లేరెవరు పోటి,
మెచ్చి నిను పిల్చేములే ఓ మహానటి!

కాసింత జాణతనం, కొండంత జాలిగుణం,
అజాఏజాలేని ఆస్తులు, అంతేలేని అపాత్ర దానాలు,
తెలియ వచ్చు సరికి తరిగిపోయిన నిధులు,
దూరంగ జరిగిన సన్నిహితులు,
నీ నీటన ఎరుగదు ఎన్నడూ ‘రీటేక్’,
నీ సహచరుడీ ఎంపికే పెద్ద ‘మిస్టేక్’,
ఆండ్రు ఇద్దరున్న జి.జినె భర్తగా
మెచ్చింది మన యింతి పూబంతి సావిత్రి,
ముచ్చటగ మొదలైంది తన కాపురం
మూడునాళ్ళ ముచ్చటగ ముగిసి పోయింది.
త్వరగానే తెలిసింది తప్పు జరిగిందని,
చేతులు కాలాక చేసేది ఏముంది,
అయినవారికై ఆరాటం, బ్రతుకు బాటలో పోరాటం,
కన్నవారికై కోనసాగు జీవనం,
వెతల వెసులు బాటుకు మదిర సేవనం,
కరిగి నీరవుతున్న మధుర జీవనం,
అవకాశ లేశము లేక శ తెల్లారగ
శల్యముగ మారంది ‘కోమా’ కు వెళ్ళింది.
నటనయే బ్రతుకైన సినీ జాబిల్లి,
జీవితాన నటన యెరుగని ఓ పిచ్చితల్లి,
పై లోకాలకే తాను పయనమయ్యింది,

కరిగి నీరవుతున్న మధుర జీవనం,
అవకాశ లేశము లేక ఆశ తెల్లారగ,
శల్యముగ మారింది ‘కోమా’ కు వెళ్ళింది.
నటనయే బ్రతుకైన సినీ జాబిల్లి,
జీవతాన నటన యెరుగని ఓ పిచ్చితల్లి,
పై లోకాలకే తాను పయనమయ్యింది.
పఠనీయం నీ జీవిత పాఠం
కవాల అందరికది గుణపాఠం!

నేడు దివిసీమ నేలుతున్న మహా “రాణి” నటి సావిత్రి దివ్యస్మృతికి కవితాంజలి. శ్రీఎమ్.వి.ఎల్.ఎన్.మూర్తి, మధురా నగర్,,హైదరాబాదు,గారి రచన

బంగారు తల్లీ కరుణాల వల్లీ
నీలాంటి నీకు సాటెవరు తల్లీ
చందమామకు లేదు నీ నిండు నగుమోము
వెన్నెలా కురవదు నీ నవ్వులా జల్లు
పూరేకులకు రావు నీ మోవి గుసగుసలు
చిలకలూ పలకవు నీ కనుల ముచ్చట్లు
బంగారు తల్లీ కరుణాల వల్లీ
నీలాంటి నీకు సాటెవరు తల్లీ

రాయంచ నేర్వాలి నీ నడకలో హొయలు
ఎంచ లేరెవ్వరూ నీనటన మెళకువలు
మంచు కంటే చలువ నీ మంచి మనసు
వెన్నకంటే మెతక లోకమంతా తెలుసు.
బంగారు తల్లీ కరుణాల వల్లీ
నీలాంటి నీకు సాటెవరు తల్లీ

నీ రాకతో మెరిసెనే తెలుగు ధరిత్రి
నటనలో త్రినేత్రి మా తల్లి సావిత్రి
బంగారు తల్లీ కరుణాల వల్లీ
నీలాంటి నీకు సాటెవరు తల్లీ

మహానటి సావిత్రికి అంజలి. కంఠంనేని వెంకటేశ్వరరావు, (సత్తెనపల్లి,గుంటూరు జిల్లా,) గారి రచన

కనురెప్పల చిరుకదలికలలో
పెదవి విరుపుల మెస్మరిజంలో
పాత్రోచిత ఉచ్ఛారణలతో
హావభావ ప్రకటనలతో
సహజత్వము ఉట్టి పడునట్లు
నటించి మెప్పంచి గతించిన
ఏకైక తెలుగు తార,అందాల
భామ మహానటి సావిత్రి
నిర్మలమైన స్నిగ్ధ మోహన
రూపము సౌందర్యంగల
శృంగార అమాయక పాత్రల
లీనమై నటించి మెప్పించిన తార
అలలు కెరటాలు ఎగసి ఎగసిపడి
తల్లి ఒడిచేరి సేద తీరు
శిఖరాగ్రముల కెగసి జారిపడిన
శాపగ్రస్తురాలైన అభినేత్రికి సాటిరారు మరెవ్వరు.
హావభావములు మోల్కయిక నటనాచతుర
సంభాషణల ముద్దుముచ్చటలు గొలిపే
ముఖకవళికలు నవరసాలు
అందచందాల అభినేత్రి మన సావిత్రి
ముద్దబంతి మోము నయనాల సొంపు
హావభావములు ప్రకటితములు కాగా
వాక్ శుద్ధి సంభాషణల శైలి సహజనటనతో
మైమరపించిన లలనా అందుకోవమ్మా మా జోహార్లు!

రాధ, హైదరాబాద్,వ్రాసిన కవిత.
” ఆమె “

చందమామలో సూర్యతేజాన్ని రంగరించి
కలువరేకులకు మెరుపుకాంతి నలది
కలువల మధ్య సంపెంగను పూయించి
సంపెంగకి సాయంగా అరవిచ్చిన గులాబీని అరువిచ్చి
ఆ గులాబీ మీద మంచు ముత్యం లాగా
మంచి నవ్వును మెరిపిస్తే
అది తేనెల వాననూ వెన్నెల సోననూ కురిపిస్తే
ఇన్ని అందాలను సన్నజాజి మోయలేదేమోనని బ్రహ్మ బెంగపడి
పూచిన గున్నమామిడిమీద ఆ ముఖ చంద్రుణ్ణి మెరిపిస్తే……
ముద్దమందారం లోని ముగ్థత్వం
గులాబీ లోని గుబాళింపూ
మల్లెలోని మృదుత్వం
సన్నజాజి సన్నని సౌరభం కలగలిపి ఒంటికి తైలం పూసి
మంచితనం అనే మంచి గంధంతో నలుగు పెట్టి
సహజత్వాన్నీ సజీవత్వాన్నీ వలువలుగా నేసి
మానవత్వపు మేలి ముసుగు తొడిగితే…………. ………………..ఆమె ?
ఆమె………………
వెండితెరకే వెలుగునిచ్చిన వెండివెన్నెల కొమ్మ
రసిక హృదయాలను దోచిన రంగారు బంగారు బొమ్మ
కరుణ రసావిష్కరణంలో కరగించే కలికి రెమ్మ
సరస శృంగార దీప్తిని వెలిగించే సావిత్రమ్మ
ఆమె -
సినీ వినీలాకాశంలో వెలిగే జాబిల్లి
కళామతల్లి సిగలో విరిసిన సిరిమల్లి
నటనకే భాష్యం చెప్పిన మహా తల్లి
తెలుగు సినీవాకిట దిద్దిన ముద్దుల రంగవల్లి
ఆమె -
సోగకన్నుల ఆ వాలు చూపు
తెలుగు ప్రేక్షక హృదయాల నూపు
ముచ్చటైన ఆ మూతి ముడుపు
మరునికే మరి మరి మరులు గొలుపు
ముని పంట పెదవి నొక్కే తీరు
పడుచు గుండెలను చీల్చే మంచు కఠారు
జాణతనము, చానతనము కలబోసిన చిలిపితనము
కనుల పండువగా రూపు కట్టే నిండైన తెలుగు ధనము
ఆమె -
నటనలు తెలియని నటీమణి
నటనలోనే జీవించిన విదుషీ మణి
జీవన పాత్రను పోషించ లేని అలివేణి
నలభైలోనే అరవై నిండిన అసంపూర్తి పాత్రధారిణి
ఆమె -
నవ రసాలను ప్రేక్షకులకు పంచి ఇచ్చి
తాను మాత్రం విషాదాన్నే గ్రోలిన నవరస కథానాయిక
సంతోషపు వెన్నెల కోసం కడదాకా వేచిన అభిసారిక
కలవరించే మన(సు)లను కలలో మాత్రమే వరించే మధుర స్వాప్నిక !!

Lingual Support by India Fascinates