శ్రీమతి పాలపర్తి ఉమాదేవి ,
శ్రీనగర్ కాలని, హైదరాబాదు గారి రచన
అభినేత్రి
సావిత్రి
అభినేత్రి సావిత్రి, అభినయ మంత్ర గాయత్రి సావిత్రి,
ఆకర్ణాంత విశాలనేత్రి అఖిలాంధ్ర ప్రేక్షకహృదయాధినేత్రి
ఒక్కింత బొద్దుగా, మరికాస్త ముద్దుగా,
మురిపించి, మరిపించు మా యింతి సావిత్రి,
చేల గట్ల వెంట స్వేచ్ఛగా ఎదిగిన
ముద్ద బంతిగ తోచు, మా ముగ్ధ సావిత్రి,
కోటి భావాల ఘరులు నీ కనుల కాసారాలు,
నవరసమ్ములు వొలుకు నీ నేత్రాంచలాలు,
అధరమ్ము విరుపులో ఎన్నెన్ని మధురిమలో
ఆ చిన్ని నవ్వులో ఎన్నెన్ని కళలో
అరనవ్వు, చిరునవ్వు, అట్టహాసపు నగవు
లొట్టి పిట్టల నగవు మా మధుర వాణికే సోబగు.
పల్లె పిల్ల పార్వతిగ పరుగులే తీసినా,
ప్రౌఢ జమిందారిణిగ హుందాగ మెలగినా,
చిలిపిగా శ్రీవారినాట పట్టించినా,
జాణ మధురవాణిగ మీరులు తాకొల్పినా,
బెత్తమ్ము చేబూని పాఠాలు నేర్పినా,
విరహిణిగ తామారి తాపమ్ము చెందినా,
కౌరవుల శాసించు రుద్ర ద్రౌపదియైనా,
ఆమెకామెయె సాటి లేరెవరు పోటి,
మెచ్చి నిను పిల్చేములే ఓ మహానటి,
కాసింత జాణతనం, కొండంత జాలిగుణం,
అజాఎజాలేని ఆస్తులు, అంతేలేని అపాత్ర దానాలు,
తెలియ వచ్చు సరికి తరిగిపోయిన నిధులు,
దూరంగ జరిగిన సన్నిహితులు,
నీ నటన ఎరుగదు ఎన్నడూ ‘రీటేక్’,
నీ సహచరుడి ఎంపికే పెద్ద ‘మిస్టేక్’,
ఆండ్రు ఇద్దరున్న జి.జినే భర్తగా
మెచ్చింది మన యింతి పూబంతి సావిత్రి,
ముచ్చటగ మొదలైంది తన కాపురం,
మూడునాళ్ళ ముచ్చటగ ముగిసి పోయింది,
త్వరగానే తెలిసింది తప్పు జరిగిందని,
చేతులు కాలాక చేసేది ఏముంది,
అయినవారికై ఆరాటం, బ్రతుకు బాటలో పోరాటం,
కన్నవారికై కొనసాగు జీవనం,
వెతల వెసులుబాటుకు మదిర సేవనం,
కరిగి నీరవుతున్న మధుర జీవనం,
అవకాశ లేశము లేక తెల్లారగ,
శల్యముగ మారంది ‘కోమా’ కు
వెళ్ళింది,
నటనయే బ్రతుకైన సినీ జాబిల్లి,
జీవితాన నటన యెరుగని ఓ
పిచ్చితల్లి,
పై లోకాలకే తాను పయనమయ్యింది.
పఠనీయం నీ జీవిత పాఠం,
కావాల అందరికది గుణపాఠం!
నేడు దివి సీమ నేలుతున్న మహా “రాణి” నటి సావిత్రి
దివ్యస్మృతికి కవితాంజలి శ్రీఎమ్.వి.ఎల్.ఎన్.మూర్తి,
మధురా నగర్,,హైదరాబాదు.
బంగారు తల్లీ-- కరుణాల వల్లీ
నీలాంటి నీకు సాటెవరు తల్లీ!
చందమామకు లేదు-- నీ నిండు నగుమోము
వెన్నెలా కురవదు-- నీ నవ్వులా జల్లు
పూరేకులకు రావు-- నీ మోవి గుసగుసలు
చిలకలూ పలకవు-- నీ కనుల ముచ్చట్లు
బంగారు తల్లీ కరుణాల వల్లీ
నీలాంటి నీకు సాటెవరు తల్లీ!
రాయంచ నేర్వాలి --నీ నడకలో హొయలు
ఎంచ లేరెవ్వరూ-- నీనటన మెళకువలు
మంచు కంటే చలువ-- నీ మంచి మనసు
వెన్నకంటే మెతక-- లోకమంతా తెలుసు.
బంగారు తల్లీ కరుణాల వల్లీ
నీలాంటి నీకు సాటెవరు తల్లీ!
నీ రాకతో మెరిసెనే-- తెలుగు ధరిత్రి
నటనలో త్రినేత్రి-- మా తల్లి సావిత్రి
బంగారు తల్లీ కరుణాల వల్లీ
నీలాంటి నీకు సాటెవరు తల్లీ!
మహానటి సావిత్రికి అంజలి
కంఠంనేని వెంకటేశ్వరరావు, సత్తెనపల్లి,గుంటూరు జిల్లా.
కనురెప్పల చిరుకదలికలలో,
పెదవి విరుపుల మెస్మరిజంలో,
పాత్రోచిత ఉచ్ఛారణలతో,
హావభావ ప్రకటనలతో,
సహజత్వము ఉట్టి పడునట్లు
నటించి మెప్పంచి గతించిన
ఏకైక తెలుగు తార,అందాల
భామ మహానటి సావిత్రి.!
నిర్మలమైన స్నిగ్ధ మోహన
రూపము, సౌందర్యంగల
శృంగార అమాయక పాత్రల
లీనమై నటించి, మెప్పించిన తార!
అలలు కెరటాలు ఎగసి ఎగసిపడి,
తల్లి ఒడిచేరి సేద తీరు
శిఖరాగ్రముల కెగసి జారిపడిన
శాపగ్రస్తురాలైన అభినేత్రికి సాటిరారు మరెవ్వరు.
హావభావములు మేల్కయిక నటనాచతుర,
సంభాషణల ముద్దుముచ్చటలు గొలిపే
ముఖకవళికలు నవరసాలు,
అందచందాల అభినేత్రి మన సావిత్రి,
ముద్దబంతి మోము నయనాల సొంపు,
హావభావములు ప్రకటితములు కాగా,
వాక్ శుద్ధి సంభాషణల శైలి సహజనటనతో
మైమరపించిన లలనా అందుకోవమ్మా మా జోహార్లు!
◄
|