కథానాయిక కథ -రచన జి.వి.జి (1963)

మహానటి సావిత్రి ఫై మొదలైన పుస్తక ప్రచురణ పరంపరలో ‘కథానాయిక కథ‘ మొట్ట మొదటిది. 1963 లో శ్రీ గడియారం వెంకట గోపాల కృష్ణ (జి.వి.జి) గారు సావిత్రి గారి అనుమతి తో, వారిని సంప్రదిస్తూ వ్రాసిన పుస్తకం. జి.వి.జి గారు ఈ పుస్తకం వ్రాస్తున్నప్పుడు ప్రముఖ సినిమా పత్రిక అయిన ‘సినిమా రంగం’ కు అసోసియేట్ ఎడిటర్ గా పనిచేస్తూ ఉండేవారు. అంతకు పూర్వం అంటే సరిగ్గా పదేళ్ళ క్రితం జి.వి.జి గారు ‘దేవదాసు’ చిత్రం లో సావిత్రి (పార్వతి) కి మారు కొడుకు అయిన మహేష్ గా నటించారు.


1963 లో మొదటిసారిగా అచ్చుఅయిన ఈ పుస్తకం ఇప్పుడు ఎక్కడా దొరకటం లేదు. అప్పుడు కొని భద్రపరిచిన అభిమానులు, పుస్తక ప్రియుల వద్ద తప్ప. అలాంటి ఔత్సాహికులే కీ||. శే||. శ్రీ వేగి వెంకటేశ్వరరావు (కన్నాయగూడెం, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా) వారి నుంచి ఈ పుస్తకం సేకరించి, సావిత్రి అభిమానులందరికీ చేర్చే ప్రయత్నం ఈ ‘ఇ-పుస్తకం’.


ఇందులో రచయిత నేరుగా సావిత్రి గారి తోనే చర్చిస్తూ విషయాలన్నీ సేకరించారు కాబట్టి, విశ్వసనీయత లో ఏమాత్రం అనుమానాలు అవసరం లేదు. ఆమె ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో ఆమె మనసు విప్పి చెప్పిన ఊసులు మనల్ని కూడా కదిలిస్తాయి.


పూర్వ కథ, ప్రేమ కథ, వివాహ కథ, ఉప కథ, వాస్తవ కథ, ప్రశ్నల కథ, ప్రస్తుత కథ, ఇంకా చిత్ర కథ… అనే శీర్షికలతో సాగే ఈ పుస్తకం ఆద్యంతం పాఠకుల ను అలరిస్తుంది. మహానటి అభిమానులు తప్పక చదువుతారని ఆశిస్తూ…


పల్లవి.కథానాయిక కథ

Lingual Support by India Fascinates