తెలుగు సినిమా – మైలు రాళ్ళు

మహాభినేత్రి సావిత్రి ఇండియా టుడే వార్షిక సినిమా సంచిక 1996

తెలుగు, తమిళ చిత్రసీమలను ఏకవచ్ఛత్రంగా ఏలి, ఒక దశలో హీరోలకన్నా ఎక్కువ పారితోషికం తీసుకున్న మహానటి సావిత్రికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టినా, భారత ప్రభుత్వం ఎందరెందరికో ఇచ్చిన ‘పద్మశ్రీ’ బిరుదును సావిత్రికి మాత్రం ప్రదానం చేయకపోవడం చోద్యం. అంతమాత్రాన సావిత్రి నటకీర్తికి వచ్చిన నష్టమేమీ లేదు. కష్టాలలో పుట్టి, కష్టాలలో పెరిగిన సావిత్రి సినీజీవిత ప్రారంభంలో సైతం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. పదమూడేళ్ళ ప్రాయంలో “అగ్నిపరీక్ష” (1949) లో సావిత్రికి తొలి అవకాశం వచ్చింది. అయితే, పసితనం ఛాయలు ప్రతిఫలిస్తున్నందున కథానాయిక పాత్రకు పనికిరావంటూ ఆమెకు వేశ్యపాత్రనిచ్చారు. “సంసారం” చిత్రం విషయంలో కూడా ఆమెకు అలాగే జరిగింది. 1950లో సంసారం చిత్రంలో ఆమెకు మొదట హీరోయిన్ పాత్ర లభించినా, దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ ఆమె మరీ చిన్నపిల్లలా ఉందని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించి చిన్న పాత్ర ఒకటి ఇచ్చారు. తర్వాత ప్రసాద్ దర్శకత్వంలోనే విజయావారి “మిస్సమ్మ” (1955) చిత్రంలో సావిత్రి హీరోయిన్గా నటించిరు. నిజానికి మిస్సమ్మ పాత్రకు చక్రపాణి మొదట్లో భానుమతిని ఎన్నుకొన్నారు. కానీ, నాలుగు రీళ్ళుతయారయ్యాక భానుమతి వరలక్ష్మి వ్రతం చేసుకుని షూటింగ్ కు ఆలస్యంగా రావడంతో చక్రపాణి కోపంతో రుసరుసలాడి, చిత్రంలో రెండవ హీరోయిన్ అయిన సావిత్రిని భానుమతి స్థానంలోకి తీసుకున్నారు. జమునకు రెండువ హీరోయిన్ పాత్ర ఇచ్చారు. “అన్నీ సంక్రమంగా జరిగి నేను “మిస్సమ్మ” చిత్రంలో నటించి ఉంటే సావిత్రి వంటి ఒక మంచి హీరోయిన్ పరిశ్రమకు అంత త్వరలో లభించి ఉండేది కాదు” అని అంటారు భానుమతి.

“దేవదాసు”లో పార్వతి పాత్రకు కూడా మొదట్లో షావుకారు జానకిని ఎంచుకుని కారణాంతరాలవల్ల సావిత్రికి ఆ పాత్ర ఇచ్చారు. దేవదాసు చిత్రంతోనే సావిత్రి భవిష్యత్తులో మహానటిగా రాణించడానకి వునాది వేసుకున్నారు. “అర్ధాంగి” (1955) చిత్రంతో తిరుగులేని కథానాయికగా స్థిరపడ్డారు. “మాయాబజార్”,”తోడికోడళ్ళు”,“మాంగల్యబలం,” “మూగమనసులు”- ఇలా ఎన్నో చిత్రాలలోని పాత్రలకు జీవం పోశారు. కళ్ళతో కోటిభావాలు పలికించగల మహాభినేత్రిగా ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. సావిత్రి మాత్రం తాను నటించిన చిత్రాలన్నింటిలోకి “చివరకు మిగిలేది” (1960) లో పోషించిన పాత్రే తనకెంతో నచ్చిందని చెప్పారు.

సావిత్రి స్వయంగా చిత్ర నిర్మాణం, దర్శకత్వం కూడా నిర్వహించారు. 1968లో ఇతర మహిళా ప్రముఖులతో కలసి శ్రీ మాతా పిక్టర్స్ సంస్థను స్థాపించి,”చిన్నారి పాపలు” చిత్రం నిర్మించారు. “మాతృదేవత” చిత్రానికి, “ఉళ్ళం”, “ప్రాప్తం” లాంటి తమిళ చిత్రాలకు కూడా సావిత్రి దర్శకత్వం వహించారు. అయితే, ఆర్థికంగా చితికిపోయారు. వ్యక్తిగత జీవిత వైఫల్యాల వల్ల ఈ మహానటి చివరి రోజుల్లో అష్టకష్టాలుపడ్డారు. సినీ నటనలో సావిత్రి సృష్టించిన ప్రమాణాలు నేటికి ఆదర్శనీయంగా మిగిలాయి. ప్రతి యువనటి తాను కూడా సావిత్రి అంత మహానటి కావాలని కలల కంటుంది. ఓ సినీ రచయిత చెప్పినట్లు – “నిండైన విగ్రహం, నటనలో నిగ్రహం, అభినేత్రి సావిత్రి, రాజ్ఞి – సినీధాత్రి!”

రెంటాల జయదేవ

Back

Leave a Reply