“నాకు ఇన్స్ పిరేషన్ మా సావిత్రి పిన్ని నటన” —-రేఖ

గత కొద్దికాలంగా షాడోలో వున్న రేఖ మళ్ళీ వెలుగులోకి వచ్చింది రాకేష్ రోషన్ – “ఖూన్ భరీ మాంగ్” , సురేష్ భగత్ – “ బివి హోతో ఐసీ”, “అజాద్ దేష్ కి గులామ్”, ఎన్.పి.సింగ్ – “కసమ్ సుహాగ్ కీ”, ఎన్. వి. రాజేంద్రసింగ్ – “ ఆగ్ కా దరియా” , దీపక్ “ మేడమ్ ఎక్స్” సావన్ కుమార్ “సౌతన్ కీ బేటీ” , ప్రదీప్ శర్మ “అసూలన్ కీ జంగ్” చిత్రాలలో నటిస్తున్న రేఖ తాను నటి కావడానికి స్పూర్తి తన పిన్ని మహానటి సావిత్రి అంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో . ఒకప్పుడు ప్రముఖ నటుడు జెమినీగణేశన్, ప్రముఖ నటి పుష్పవల్లి కుమారై రేఖ. జెమినీగణేషన్ నలుగురు భార్యల్లో,రెండో భార్య పుష్పవల్లి అయితే, మూడో భార్య మహానటి సావిత్రి.

కమల్ హాసన్ కు సావిత్రి అంటే విపరీతమైన అభిమానం, ఆరాధన. అతను ఇటీవల రేఖను కల్సినప్పుడు , “ నీ నటన నాకు సావిత్రిని జ్ఞాపకం తెప్పిస్తున్నాయి”, అనగానే రేఖ సావిత్రి నటించిన రెండు చిత్రాల్ని వీడియోలో చూసి ఆశ్చర్యపోయింది. సావిత్రి ప్రతీ కదలిక , చూపు, ఎక్స్ ప్రెషన్ అన్నీ తను నటిస్తున్నవే.
“అంటే చిన్నప్పుడే మీరు సావిత్రి చిత్రాలను చూసి ఆమెని ఇమిటేట్ చెయ్యాలనుకున్నారా? అన్న ప్రశ్నకు-“లేదు. చిన్నప్పుడు నేను సావిత్రి పిన్నిని మూడు, నాలుగు సార్లు చూశానేమో. కారణం అమ్మకు ఇష్టం వుండేది కాదు. సావిత్రి పిన్ని గురించిన విషయాలు మాట్లాడటం అన్నా,సావిత్రి పిన్నిని చూడటం అన్నా కూడా. నేను , సావిత్రి పిన్ని బాబు, పాప కూడా ఒకే స్కూలులో చదువుకునే వాళ్ళం. అప్పుడు సావిత్రి పిన్ని వాళ్ళని స్కూల్ దగ్గర వదిలి పెట్టడానికి లంచ్ తీసుకువచ్చేటప్పుడు చూసేదాన్ని. నాకు సావిత్రి పిన్నిని చూడగానే ఎంతో ఇష్టం కలిగింది . అది ఎందుకు, ఎలా కలిగిందో నేను చెప్పలేను. నా ఇష్టాన్ని నేను మనసులోనే రహస్యంగా దాచుకున్నాను. ఆ రోజుల్లో నన్ను అసలు సినిమాలు చూడనిచ్చే వారు కాదు. ఆ రకంగా నేను పిన్ని చిత్రాలు ఎక్కువ చూడ లేదు కూడా. కానీ చూసిన కొద్ది సినిమాలు నన్ను ప్రభావితం చేశాయి. సబ్ కాన్షస్ గా నాలో ఆమె నటన స్టోర్ చెయ్యబడింది. అందుకే నాకు తెలీకుండానే నేను – కొన్ని నా ఎక్స్ ప్రెషన్స్ సావిత్రి పిన్నిని పోలివుంటాయి”.

మీ చిత్రాలు ఏవైనా మీ సావిత్రి పిన్ని చూసి మెచ్చుకున్నారా ?
“సావిత్రి పిన్ని నా చిత్రాలు అన్నీ చూసిందో లేదో నాకు తెలియదు కానీ నా జీవితంలో నేను అనుకున్నది సాధించాను. అది పిన్ని చేత మెచ్చు కోబడటం – అది నటిగా నా గమ్యం. నేను, పిన్ని ఎప్పుడూ డైరెక్ట్ గా మాట్లాడుకోలేదు. మా అమ్మ అంటే నాకు విపరీతమైన ప్రేమ. నేను సావిత్రి పిన్నితో నాకు మాట్లాడటం అమ్మకు ఇష్టం లేదు. అందుకనే నా ఇష్టాన్ని నేను మనసులో వుంచుకున్నా. కాని నా చిత్రం “ఉమ్రాన్ జాన్” చూసి నాతో డైరెక్ట్ గా మాట్లాడకుండా ప్రక్కన వున్నకమల్ తో నువ్వు పుష్పవల్లి కూతురివి కదూ బాగా నటించావు అంది . నాకు ఆనందంతో నృత్యం చెయ్యాలనిపించింది.

సావిత్రి మహానటి. ఆమె తెలుగు నటి అయినా,తమిళ , కన్నడ, మలయాళ భాషలు చాలా ఈజీగా మాతృభాష మాట్లాడినంత హాయిగా మాట్లాడేది, నటించేది. నాకు అందుకే పిన్ని అంటే అంత ఎడ్మిరేషన్. కాని పిన్ని చివరి రోజులు గుర్తుకు వస్తే మాత్రం ఇప్పటికీ నా కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. రెండున్నర సంవత్సరాల పాటు అలా కోమాలో హస్పిటల్లో బెడ్ మీద వుండి చనిపోయింది. అలాంటి చావు రాకూడదు. మా పిన్ని మహానటి కాకుండా గొప్పవ్యక్తి కూడ”. అంది రేఖ, ఇన్ని సంవత్సరాల మౌనం నుంచి బయటకు వచ్చి సావిత్రి గురించి మాట్లాడుతూ సావిత్రి పట్ల తనకున్న ఆరాధన అభిమానం చెబుతూ.

Leave a Reply