తపాలా బాల!

మహారాజశ్రీ…. గారికి నమస్కరం ఇక్కడంతా క్షేమం. మీ క్షేమ సమాచారం తెలుపగలరు. మహానటి సావిత్రి పేరు మీద ఓ తపాలా బిళ్ల విడుదలైంది. ఈ సారి నుంచి ఉత్తరం చించేటప్పుడు స్టాంపు జాగ్రత్త!

భవదీయుడు….

పోస్టు మాస్టారు బాబాయిగారికి పెద్దచిక్కే వచ్చిపడింది. తపాలా ముద్రేసి, అందాల చందమామ మొహానికి మసి పూయడానికేమో మనసొప్పుకోదు. ముద్రలేకుండా బట్వాడా చేద్దామంటే తపాలశాఖ ఒప్పుకోదు. నిధి చాల సుఖమా, రాముని సన్నిధి చాల సుఖమా అన్నంత డైలమా.

మాస్టారి కష్టం చూసి, ఏలోకాల్లోనో ఉన్న ( ఏ లోకాలో ఏమిటి స్వర్గమే, దేవత లుండేది అక్కడేగా) మహానటి సావిత్రి నవ్వుకుంటూ ఉంటుంది. ‘’ మాయాబజార్ లో లక్ష్మణకుమారుడి అమాయకత్వాన్ని చూసి నవ్వే మాయా శశిరేఖలా

సావిత్రి గురించి చెప్పుకోడానికి ఏమీ మిగల్లేదు. చెప్పాల్సిందంతా చెప్పేశారు. రాసుకోడానికి ఏమీ మిగల్లేదు రాయాల్సిందంతా రాసేశారు. అయినా ఊరుకుంటామా, అందుసోనూ సావిత్రి పేరు మీద స్టాంపు విడుదల చేస్తున్నారాయె.

చంద్రుడి గురించి ఎంతమంది రాయలేదు, అలా అని రాయకుండా మనేస్తున్నామా? వెన్నెల గురించి ఎంతమంది రాయలేదు, పాతబడిందని పక్కనపెడుతున్నామా?

ఓ వెన్నెల. ఓ చంద్రుడు , ఓ సావిత్రి…


కాలదేషం పట్టని కమ్మని ఇతివృత్తాలు!


వెన్నెల చల్లగా ఉండును. చంద్రుడు తెల్లగా ఉండును. మరి సావిత్రి?


‘ నా హృదయంలో నిదురించే సఖీ’….


పాటలో ‘ వెన్నెల సోన’ సావిత్రి.


‘ కోలు కోలోయమ్మ,’…. పాటలో ‘పలికితే


ముత్యాలు రాలే బేల’ సావిత్రి.


‘ముద్దబంతి పువ్వులు బెట్టి ’… పాటలో


‘ హంసలా నడిచివచ్చే చిట్టెమ్మ’ సావిత్రి.


వెన్నెలకు చంద్రుడిష్టం. చంద్రుడికి


కలువలిష్టం. మరి సావిత్రికి?


రంగురంగుల చీరలిష్టం.


సింగపూరు చీరలంటే మరీ….!


నవ్వునవ్వుల పాపాయిలిష్టం.


చిన్నారి విజయచాముండేశ్వరి అంటే ఇంకా…!


లేతలేత పువ్వులిష్టం.


మల్లెలన్నా, సన్నజాజులన్నా…!


ఉయ్యాలజంపాల జూకాలిష్టం.


అవి పెట్టుకుంటే జింకపిల్లే!


ఆమె తెలుగు మాట్లాడితే ‘ నడిగర్ తిలగత్తుకు తెలుంగు తెరియునా’

అని ఆశ్చర్యపోయారు తమిళులు. ఆమె తమిళం మాట్లాడితే ‘ మన సావిత్రికి అరవం కూడా వచ్చురోయ్’ అని మురిసిపోయారు తెలుగు వాళ్లు ఆమె కన్నడం మాట్లాడుతుంటే, ‘ బంగారద హెణ్ణు’ అంటూ కస్తూరివారు కళ్లకద్దుకున్నారు. సావిత్రి కళ్లు మాట్లాడే విశ్వదనీన భాషకైతేయయయ ఉత్తర దక్షిణ భారతాలు ప్రదక్షిణ నమస్కారాలు చేశాయి. సినిమాలో సావిత్రి ఉందంటే,సంభాషణల రచయితకు బోలెడంత రాత సామగ్రి ఆదా. పెద్దగా డైలాగుల అవసరం ఉండదు. కళ్లభాష ప్రపంచంలో ఆమెకే వచ్చు. ఆమె ముందూ తర్వాతా చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు. నటీ మణులు ఎంతోమంది ఉంటారు. ‘ మహానటి’ మాత్రం ఒక్కరే, సావిత్రి ఒక్కరే! మొహమాటానికి పోయె, రవీంద్రభారతి చప్పట్లకి ఆశపడో ఆ బిరుదు ఎవరికీ తగిలించకండి.

సావిత్రే లేకపోతే?…

అక్కినేని ‘ దేవదాసు ’ వచ్చేది కాని సినిమా విడుదలైన కొద్దిరోజులకు పార్వతి కూడా చచ్చి పోయేది. ‘ మాయాహజార్’ వచ్చేది. సొగసరి శశిరేఖ త గడసరో తెలుగువాళ్లకి తెలిసేది కాదు ‘ మిస్సమ్మ’ వచ్చేది. అందులో ఆత్మ మిస్సయ్యేది. ‘ మూగ మనసులు’ వచ్చేది. సావిత్రి కోసమే పుట్టిన కొన్నిపాత్రలు ‘ ఎందుకు పుట్టామా’ అని బాధపడేవి. వాటి సృష్టికర్తల మనసు తల్లడిల్లేది. వెండితెర చిన్నబోయేది. స్టేషనుకొచ్చిన ప్రతి రైలుబండి లోనూ అతిథుల్ని వెతికివెతికి వెనుదిరిదిపేయే ఆత్మీయుడిలా, ప్రేక్షకులు నిరాశాపడిపోయే వారు. ఆ పెద్ద పెద్దర కళ్లను చూసే అదృష్టం దక్కేది కాదు. నిండుచందమామ నవ్వును ఆస్వాదించే వకాశం వచ్చేది కాదు.

అందమంటే ఇలా ఉంటుందని సాధికారంగా చెప్పడానికి ఉదాహరణ దొరికేది కాదు. అంతే, అంతే! అంతకన్నా పెద్ద నష్టమేం లేదు.

సావిత్రిది ఎడమచేతి వాటం. ఆమె ఎడమచేత్తో ఇచ్చింది కుడుచేతికి తెలిసేది కాదు. గుప్తదానాలకు లెక్కేలేదు. పేదల ఇంట్లో పెళ్లయితే తాళిబొట్టు సావిత్రి ఇంటి నుంచే, బంధువుల ఇంట్లో పెళ్లయితే పానకపు బిందె సావిత్రి ఇంటి నుంచే, ఉన్నప్పుడే కాదు, అన్నీ పోగొట్టుకున్నాక కూడా, ఆ దయాగుణానికి… షీల్డులు కరిగిపోయాయి. అవార్డులు మార్వాడీ కొట్టు చేరాయి. పట్టుచీరలు మాయమయ్యాయి.

‘ మళ్లీ ఎప్పుడూ పుడతావు సావిత్రమ్మా?’

అని అడగాలనిపిస్తుంది కానీ… అరుదుగా దొరుకుతాయి కనుకే వజ్రాలకంత విలువ. కొందరు వ్యక్తులు అంతే, శతాబ్దికో సహస్రాబ్దికో ఒకరు. మరి అలాంటి అరుదైన మహానటి పేరున వచ్చే స్టాంపు తెలుగు వారందరికీ ఆత్మీయకానుక కాదూ‘!

Back

2 Comments

Leave a Reply