రాలిన తార ఈనాడు విజయవాడ సోమవారం 28-12-1981

మద్రాసు, డిసెంబర్ 27¬. సుప్రసిద్ద చలనచిత్ర నటి శ్రీమతిసావిత్రి నిన్న రాత్రియిక్కడ ఒక ప్రైవేట్ నర్సింగ్ హొంలో మరణించారు. ఆమె వయసు 45 సంవత్సరాలు. 250కి పైగా చలన చిత్రాలలో నటించిన శ్రీమతి సావిత్రి కనీసం రెండు శతాబ్దాలపాటు తెలుగు, తమిళ చలన చిత్రసీమలో ప్రముఖ నటిగా వెలుగొందారు.

ఆఖరు దశలో ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. అంతిమ శ్వాసకు ముందు దాదాపు ఒకటిన్నర సంవత్సరాల కాలం ఆమె మగత (కోమా)లో వున్నారు. నుంగంబాకంలోని ఆమె నివాసం వద్ద, ఆమె భౌతికయాన్ని నేడు ఆమె అభిమానులు , చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు వ్యక్తులు సందర్శించారు. శ్రీమతి సావిత్రి భర్త శ్రీ జెమినీ గణేశన్ కూడా నటుడే. వారికి ఒక కుమారుడు, ఒక కుమారై వున్నారు.

గుంటూరు జిల్లాలో జన్మించిన సావిత్రి చిన్ననాటే తండ్రిని కోల్పోయింది. ఆమె పెద్దనాన్న ఇంట్లో పెరిగింది. బాల్యంలో విజయవాడలో గడిపిన ఆమె అక్కడే చదువు , నృత్యం పూర్తిచేసింది. “సంసారం” చిత్రం ద్వారా శ్రీ ఎల్. వి ప్రసాద్ సావిత్రిని తెలగు తెరకు పరిచయం చేశారు. 1952లో “ పల్లెటూరు” చిత్రంలో శ్రీ ఎన్. టి . రామారావుతో పాటు నటించింది. 1953లో వేదాంతం రాఘవయ్య నిర్మించిన “దేవాదాసు” చిత్రంలో సావిత్రికి పార్వతి పాత్ర పోషణను
అప్పచెప్పారు. సావిత్రి పార్వతి పాత్రలో తెలుగు ప్రేక్షకుల హృదాయాల పై చెరగని ముద్ర వేసింది . నటనతో తృప్తిపడక దర్శకత్వ బాధ్యతను కూడా చేపట్టారు. “చిన్నారిపాపలు”, “చిరంజీవులు”, “మాతృదేవత”, “వింతసంసారం”, మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. జీవితంలో మహానటిగా ఉన్నతశిఖరాలను అధి రోహించి చివరికి ఆమె జీవితం విషాదాం తంగా ముగియడం శోచనీయం. అవసర సమయంలో ఆత్మీయుల ఆదరణకరువైంది . మానసికంగా ఆమె కుంగిపోయింది. 1980 మే నెలలో మందులు మింగి బెంగుశూరు హొటల్ లో ఆమె అపస్మారక స్థితిలో పడింది. ఆ అపస్మారక స్థితిలోనే మృత్యువు ఆమెను కబళించింది.

శ్రీమతి సావిత్రి భౌతికాయాన్ని సందర్శంచినవారిలో తమిళనాడుముఖ్యమంత్రి శ్రీ ఎం. జి రామచంద్రన్ ఆయన మంత్రి వర్గ సహచరులు కూడా ఉన్నారు. శ్రీమతి సావిత్రి భౌతికకాయాన్ని యిక్కడ కార్పొరేషన్ వారి దహనవాటికలో నేడు దహనం చేశారు.

Leave a Reply