వెండితెర

“రంగు బంగారు స్టారౌదునే”

వంద చిత్రాలు నటించు స్టారునై…… ”

అంటూ “ వదిన” చిత్రంలో పాడుతుంది శ్రీమతి సావిత్రి. అన్నట్లుగానే శరవేగంతో నూరు చిత్రాలను పూర్తి చేసింది. తెలుగు, తమిళ సీనీరంగాల్లో అద్వితీయ నటీమణిగా పేరు గడించుకుంది. ఆమె తొలి చిత్రమైన “సంసారం” లో ఎక్ స్ట్రాగా ఓ కోరస్ పాటలో పాల్గొని చేతులు త్రిప్పుతూ పాడి, శ్రీ నాగేశ్వరరావు గార్ని “హీరో నాగేశ్వరరావులాగున్నావే” అంటూ ఎగాతాళి చేసి, ఆ ఒకేఒక డైలాగుతో తన పోర్షన్ ను పూర్తిచేసుకున్న ఆమెను, ఆ చిత్రంలో, ఈనాడు చూచే తెలుగు ప్రేక్షకుడు ఓ నవ్వు నవ్వి, “ అయ్యో సావిత్రీ! ఈనాటి మేటినటియైన నీకు ఆనాటి పాత్ర యిదా!” అని అనుకుంటాడు. అలా మొదలయింది ఆమె సినీ జీవితం. ఈనాటికి శతచిత్ర నటీమణి అయింది.

తను యీనాడు యింత పెద్దనటి కావడానికి “ విజయా”వారి ఆదరాభిమానాలే ముఖ్యకారణంమంటుంది ఆమె. ఆ కృతజ్ఞతతోనే తన చిన్నారి పాపకు “విజయ” అని పేరుపెట్టిందని కొందరు అన్నారు. ఆమెను పర్మనెంట్ అర్టిస్ట్ గా “విజయా”వారు తీసుకోవడం మూలంగానే వచ్చిన మొదట్లో సినీరంగంలో నిలద్రొక్కుకోవడానికి ఆసరా అయింది. చంద్రహారం మొదలు ఈనాటి వరకు విజయావారి చిత్రాలన్నింటిలోను (తగిన పాత్రలేని “జగదేకవీరుని కథ”లో) తప్పిస్తే ఆమె నటించింది.

సావిత్రి నటించిన విజయావారి మరోచిత్రం “గుండమ్మ కథ” శతదినోత్సవాలు చేసుకుంది. చక్కని కుటుంబ గాథతో, నలుగురు “టాప్ ఏక్టర్ల” కూడికతో, తెలుగు పెద్ద నటులిద్దరికి నూరవ చిత్రంగా రూపొందిన ఖ్యాతితో “గుండమ్మ కథ” ఒక విశిష్ట చిత్రంగా తయారయింది. అటువంటి యీ విశిష్ట చిత్రం సావిత్రికి కూడా ఒక విశిష్టతను చేకూర్చింది. “వెలుగునీడలు” నుండి “మంచి మనసులు” వరకు వరుసగా ఆమె నటించిన నాలుగు చిత్రాలు శతదినోత్సవాల కెళ్ళాయి. ఇప్పుడు “గుండమ్మ కథ” అయిదవ చిత్రం అవుతోంది. ఇలా “ వరుస” లో శతదినోత్సవాల చేసుకున్న చిత్రాల్లో నటించిన కీర్తి మరే యితర నటికి లభించలేదు. అది ఒక్క శ్రీమతి సావిత్రికే దక్కింది. అందుకు కారణం ఆమె నటనా కౌశల్యం, ఆమె నటించే చిత్రాల్లో ఉండే కథాబలం. ఆమె ధరించే పాత్రల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రత్యేకత కలిగిన కథా నాయిక పాత్ర ఉండే కథ సహజంగా బలమైనదిగానే ఉంటుంది. అందువలన ఆమె నటించే చిత్రాలకొక ప్రత్యేకత, తద్వారా ప్రజాదరణ ఉంటుంది. అమె నటించిన చిత్రాలను పరికిస్తే, పై మాటల్లోని నిజం స్పష్టమౌతుంది. తన పాత్రను అర్ధం చేసుకుని, పాత్రౌచిత్య భంగం రాకుండా, ప్రతిభాయుక్తంగా నటించడంలో ఆమెకామే సాటి. వివిధానుభూతుల్ని హావభావ రూపాల్లోనికి అనువదించి నటించడంలో ఆమెకొక ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంది. శతదినోత్సవ చిత్రతోరణంలో మొదటిదైన “ వెలుగునీడలు” లోని పాత్ర గొప్పదనము, ఆ పాత్రను పోషించడంలో ఆమె చూపిన ప్రతిభ చూచిన వారికి వేరే చెప్పవలసిన అవసరంలేదు. ఆ చిత్రం రాణించడానికి హీరో ఎంత కారకులో, హీరోయిన్ కూడా అంతే కారకురాలైంది. “కలసి ఉంటే…” లో చెప్పుకోతగ్గ పాత్రేమీ కాకపోయినా, కొట్టిపారవేయడానికి వీల్లేదు. పోతే యీ సంవత్సరం మొదట్లో విడుదలైన “ఆరాధన” విజయవంతంగా నడవడానికి ఆమె ఎంతగా తోడ్పడిందో అందరికీ తెలుసు, తర్వాత “మంచి మనసులు” చిత్రం 19 కేంద్రాల్లో శతదినోత్సవాలై, ఆపైన కనీసం రెండుమూడు కేంద్రాల్లోనైనా రజతోత్సవాలు జరుపుకోవడానికి సంసిద్ధమౌతున్నదంటే అందుకు ముఖ్యకారణం “ శాంతి ” పాత్రకు సావిత్రి పోసిన ప్రాణం! కోర్టు సీనులో లాయర్ గా ఆమె మాటల్లో, నటనలో ఆమె చూపిన నిండుదనం, హూందా ప్రేక్షకుల చేత “ సెభాష్” అనిపించుకుంది . అటువంటి కోర్టు సీను తెలుగు చిత్రాల్లో దేనిలోనూ చూడలేదని ప్రజాభిప్రాయం. “ మంచి మనసులు” పేరు చెప్తే శ్రీమతి జ్ఞాపకమొస్తుంది ప్రతివారికి.

ఆమెకు మొదటినుండి విశిష్టమైన పాత్రలు లభ్యమవుతూ వచ్చాయి. ఆమెకు లభ్యమయినన్ని మంచిపాత్రలు మరెవరికి లభ్యము కాలేదు కూడా. అందుకు తగ్గట్టుగా ఆయా పాత్రలకు జీవాన్ని పోసింది. తొలిచిత్రాల్లో ఒకటైన
“ దేవదాసు” లో పార్వతి పోర్షన్ లో ఆమెను చూచినవారు యీనాటికి మరువలేరు. ఆ చిత్రమే ఆమెకు చిత్రరంగంలో భవిష్యత్తును ఏర్పరిచింది. నటనా జీవితానికి రూపురేఖల్ని దిద్దింది. ఆ తర్వాత “ మిస్సమ్మ”, “అర్ధాంగి”, “దొంగరాముడు” చిత్రాల్లో ఆమె నటన బహుళ ప్రశంసలందుకుంది.

ఈ మధ్య చిత్రాల్లో “మా బాబు” చిత్రంలో తల్లిగా ఆమె చూపిన నటన, మాతృహృదయపు మమత ఆ పాత్రకు ఆమెకు కూడా ఒక మహోన్నత స్థానాన్ని అధిరోహింపజేసింది. ఆమె వ్యక్తిత్వానికే వెలుగును చేకూర్చింది. ఆ విధంగా ఆ పాత్రను పోషించడం అనన్య సాధ్యమేమోననిపిస్తుంది. “కుంకుమరేఖ”లో ఒకే జీవితంలో ఏర్పడిన విభిన్న స్థితులు కలిగిన పాత్రను పోషించి ప్రశంసలు పొందింది. బరువైన పాత్రలు, తేలిక పాత్రలు, హాస్యపాత్రలు యీలా ఎన్నో పాత్రల్లో ఆమె జీవించింది. పాత్రలకు నిండుదనమిచ్చింది. ఆ పాత్రలకు, తనకు కూడా ప్రత్యేక స్థానాన్ని గడించుకుంది. మద్రాసు సినీరంగంలో అద్వితీయ నటి అయింది.ఆమెను గురించి ఆంధ్ర సచిత్ర వారపత్రిక కార్టూనుల చిత్రకారులు శ్రీ బాపు యిలా వ్రాశారు.

“ నిండైన విగ్రహం, నటనలో నిగ్రహం

శ్రీమతి సావిత్రి, రాజ్ఞి సినీ ధాత్రి”

ఆ రెండు ముక్కల్లో శ్రీమతి సావిత్ర పూర్తిగా కనిపిస్తుంది.ఆమెను నటిగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ఆంధ్రులు గౌరవిస్తున్నారు. ఆమె నభిమానించే అభిమానులు సదభిప్రాయంతో సగౌరవంగా ఆదరిస్తున్నారు. సోదరీ వాత్సల్యంతో ఆమెను అభిమానించే వారెందరో ఉన్నారు. ప్రేక్షకులే కాదు ఎన్నో పత్రికలు కూడా ఆమెను గౌరవాభిమానాలతో చూస్తున్నాయి. అటువంటి వ్యక్తిగత గౌరవం బహుళంగా పొందగలిగిన ఘనత కూడా ఆమెకే దక్కుతుంది. ఆ గౌరవాభిమానాలను ఎల్లకాలం నిలుపుకోవలసిన బాధ్యత ఆమెపై ఉంది. శతచిత్ర నటీమణి, శతదినోత్సవ చిత్రతోరణ తార అయిన శ్రీమతి సావిత్రి కలకాలం కళకళ లాడుతూ జీవించి తెలుగు తెరను వెలుగు జిలుగులతో నింపి, ఆంధ్రుల ఆదరాభిమానాలను యింకా యింకా బడయాలని ఆశిస్తున్నాను, ఆమెకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించుగాక.

Back

Leave a Reply