1967లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో నాలుగు వారాల పాటు

పాఠకుల             ప్రశ్నలకు మహానటి సావిత్రి ఇచ్చిన సమాధానాలు.    

 

సుభాష్ చంద్ర బోస్ ,  అవనిగడ్డ.

 ప్రః మీరు సమాధానాలు ఇస్తున్నారనేసరికి లాటరీలో లక్ష రూపాయలు వచ్చినంతగా సంతోషం కలిగింది,కారణం ఏమిటంటారు?

జఃఏముంటుందిః మీ ఆభిమానం అల్లాంటిది,  Thanks.

ఎఃయాదేంద్ర గౌడ్ హైదరాబాద్.

 ప్రః వెలుగుకి చీకటికి తేడా ఎంతండి?

జః ఈ రోజుల్లో  వ్యాపారానికి. స్మగ్లింగ్‌కూ వున్నంత....

భంబోయిన వెంకట రామకృష్ణారావు, భీమవరం.

 ప్రః విచారం అనేది కలగకుండా వుండాలంటే ఏం చేయాలి?

జః పకపక నవ్వుతూండండి.

బి.లింగారావు కవాడిగూడ.

  ప్రః మేనరికం గదా అని యిష్టం లేకపోయినా పెద్దల ఒత్తిడి వలన పెళ్ళాడాడు  అతడు ఓ అమ్మాయిని. ఆమెకు చదువు రాదు. అతను చెప్పడానికి ప్రయత్నిస్తే ఆమె నిరాకరించింది. ఎలా? 

జః ఇష్టం లేకపోతే బలవంతాన చదివించినా ప్రయోజనమేముంది. కమ్మగా కాపురం చేసుకోమనండి... ఏ గొడవా వుండదు.

సి.మల్లయ్య, ఎల్లందు.

      ప్రః ఆడవాళ్ళు మగవారి మనసు ఇట్టే మార్చేయగలరు. మరి మగవారు అలా      మార్చలేరు ఎందుకు? రోజూ ఓ యువతి ఎదరై నవ్వి, నవ్వించి, నన్ను  రెచ్చగొడుతూ ఉంటుంది. నేను దగ్గరకు వెళ్ళబోతే పారిపోతూంటుంది ఎందుకు?

జఃమీ మొదటి ప్రశ్న రెండో దాని వలన ఆర్థమయింది, మరీ అంత వెనక పడకండి...

 జి.వి.సి రంగారావు, భోధన్.

     ప్రః పరిస్థితులతో రాజీపడలేక, తప్పుకోలేక, పెరిగే ధరల మధ్య గొంతుదాక దిగబడిపోయి, ప్రభుత్వమూ గుర్తించక, పై ఆధికారులు జీతాలు పెంచక, పెంచమని అడగలేక, పడే భాధలు అంతమయ్యేది ఒక ఆత్మహత్య తోనేనంటారా? మరేదైనా మార్గం వుందంటారా?

 జః మధ్య తరగతికిది తప్పనిసరిః యుగసంధిలో చిక్కులు తప్పవు.

 వి. వి. స్వామి, కరీంనగర్.

  ప్రః కేవలం స్త్రీ నే పతివ్రతగా జీవించమని ఆదేశిఁ చాడంటారా దేవుడు?

 జః లేదేః శ్రీరామ చంద్రుడిలా వుండమని మగవాళ్లను ఆదేశించాడుగదా.

  ప్రః సమయంతోడై అనుభవించే అవకాశం కలిగితే ఏం చేయాలి?

జః ఆలోచిస్తూ కూర్చుంటే అది కాస్తా చేజారి పోతుంది.

 డి.సరోజ. నూజివీడు.

  ప్రః నేను ఇంజనీరింగ్ కోర్సు చదవాలనుకుంటున్నాను. కాని ఇంట్లో అంగీకరించటం లేదు. ఎల్లా?

 జః మీ ఆర్థిక పరిస్థితులు ఆలోచించడం, అర్ధం చేసుకోవడం ముఖ్యం నీకు,

 వెళ్శూరి సుబ్బలక్ష్మి. నాగాయిలంక.

   ప్రః ఒక అల్లుడికి అత్తగారిఁ ట్లో అందరూ తిన్నాక భోజనం పెడతారు...

 జః ఇల్లరికపు అల్లుడేమే పాపం.

  డి. టి.మాధవశర్మ- విజయవాడ.

  ప్రః మీ హాబి ఏమిటి?

 జః ప్రస్తుతం --- నలభీమపాకం.

 ఆది కుందేరు.

  ప్రః భాగ్యవంతుల బిడ్డలు, ఎంత డబ్బు గల వారైనా, మరి అంత ఒంటి మీద బట్టలుండీ లేనట్లు డ్రెస్ చేసుకుంటారు... గుడ్డ కరువా? ఈ అర్ధనగ్నానికి కారణం?

 జః మోడరన్ ఫాషన్ మరి….

 పి.రామ్మోహన్ కావలి.

  ప్రః తెలుగు చిత్రాలలో సంఘటనలు సహజత్వానికి దూరంగాను, బెంగాలీ చిత్రాల్లో దగ్గరగాను వుంటుంటాయి, కారణం?

జః మన స్పీడ్ అల్లాంటిది.

  ప్రః హాలీవుడ్ చిత్రరంగంలో మీ అభిమాన హాస్యనటులెవరు?

జః జెర్రీలూయిన్,s రెడ్ వ్కలిటన్,

జి.జె, రావు. విజయవాడ.

ప్రః ఒకామె తన మేనమామను చేసుకోవాలను కుంది. కాని ఆయన మరొకరిని   ప్రేమించి వున్నారు, చివరికి మేనమామను పెళ్లాడింది.వారికొక బిడ్డ  కలిగంది. బిడ్డకు ఆయన తన ప్రియురాలి పేరు పెట్టుకున్నారు. భార్యకు తెలుసున్నా భాదపడలేదు. ఆయన మనస్సు ఆమె మీద నుంచి తప్పుకోవడం లేదు.రోజూ భాదపడతారు, ఆయన భాద చూడలేక భాధ పడుతుంటుంది. వారిద్దరి ప్రేమకు తను అడ్డుగా నిలబడ్డానేమోనని కుమిలిపోతూంటుంది... .... వారిద్దరిని  విడదీశానా అని ఏడుస్తుంది ? ఏం చేయాలి భార్య?

 జః ఉన్న బాధను మరింత రెచ్చగొట్టక, అమె తన సేవలతో తన భర్త మనసు   మార్చుకోవాలి. ఆ బాధ నుంచి మరపించగలగాలి.                             

           ప్రః  150 చిత్రల్లో నటించారుగదా? మీ మనస్సుకి నచ్చిన జోడీ (సినిమా) ఎవరు   చెప్పండి?

 జః నిజం చెప్పనా? శ్రీమతి సావిత్రి, నటి సావిత్రి కలసి కనిపించిన చిత్రం జోడి.

 ఆర్. జగన్మోహనరావు.

 జి.మృత్యంజయరావు. బొబ్బిలి.

           ప్ర. సినీరంగంలో పేరూ ప్రఖ్యాతి గడించడం నటునకు సులభమా నటికా?

 జః ఇద్దరకీ సులభంకాదు.

 సి. సీలాకుమారి. వైజాగ్.

           ప్ర. మీరే నెలలో పుట్టారు?

 జః జనవరి ( 4 వ తేది) నెలలో.

 కె. వెంకటెశ్వర్లు. వరంగల్.

           ప్రః కష్టాల్లో వున్నప్పుడు, స్నేహితులు కూడా వదిలేస్తారేమండి?

 జః అల్లా వదిలేసే వారిని స్నేహితులు అంటారేమిటి? అవసరానికి చేరే                 పరిచయస్థులందరూ ప్రాణమిత్రులుకారు- కాలేరు.

 గత్తుల గంగాధరరావు, వేల్పూరు.

           ప్రః మీరు, అక్కినేని నాగేశ్వరరావు కలసి నటించిన చిత్రాలు చూస్తే ఒక            విధమైన నిజ జీవిత సంఘర్షణ కనిపిస్తుంది. కారణం?

 జః యాక్టింగూ, యాక్షనూ కలియడం వలన...

  పి. రమాదేవి నెల్లూరు.

           ప్రః డబ్బున్నవారు డబ్బుంది గదా అని కట్నాలు పోసి ఆడపిల్లలకు పెళ్ళిళ్లు  చేస్తున్నారు, ప్రభుత్వం దీన్ని అరిగట్టలేక పోతోంది. కట్నం యివ్వందే పెళ్ళి  జరిగేలా లేదు. మీ దగ్గరకూడా చాలా డబ్బుందని, మీ అమ్మాయికి కట్నం  యిచ్చే పెళ్ళిచేస్తారా?

 జః ఆడపిల్లల్ని కన్న తర్వాత సమయానుకూలంగా నడుచుకోవసిందే,               ఎవరైనాసరే.

           ప్రః మీరు నాగేశ్వరరావుగారు కలసి నటిస్తున్న చిత్రాలేమైనా వున్నాయా      యిప్పుడు?

 జః ప్రస్తుతం ఏమీ లేవు.

           ప్రః మీ మొదటి చిత్రంలో మీ ప్రక్క నటించిన హీరో ఎవరు?

 జః ఆ చిత్రంలో హీరో లేడు.

           ప్రః భారత ప్రియతమరత్న శ్రీ నెహ్రూజీని మీరు అఖరి సారి ఎక్కడ    కలుసుకున్నారు?

 జః స్టేట్ ఎవార్ట్సు ఫంక్షనులో 1964  ఏప్రిల్ 25వ తేదిన డీల్లీలో వారిని   కలుసుకుని మాట్లాడగలిగాను.

           ప్రః సినిమా నటులను ముచ్చటపడి చూడవచ్చిన ప్రజలు  తిరిగి ఆ నటులపైనే  రాళ్ళు రువ్వటంలో ఆంతర్యం ఏమిటంటారు?

 జః కేవలం కట్టలు తెగిన ఉత్సాహ ఫలితం అది.

 యన్. మలారెడ్డి, నిజామాబాద్.

           ప్రః నాగేశ్వరరావుగారి నేనూ, నా జీవితం పిదప నేను, నా నటన అనే  శీర్షికతో మీరు ఆంధ్రజ్యోతి లో వెలువరచకూడదా?

 జః అవకాశం వుంటే అల్లాగే.

 సుమతిబాయి. కోనాల.

      ప్రః సుఖసంతోషముల విలువ తెలియాలి అంటే ముందు   బాధననుభవించవలసి వుంటుంది కాని ఆ సుఖం  ఎప్పుడు? ముసలి  తనంలోనా?

 జః మనషికి తృప్తివుంటే ఏ వయసులో నైనా సుఖాన్ని పొందవచ్చు.

 ఎ.సూర్యనారాయణ. ఆముదాలవలస.

           ప్రః ఆడదానికి కన్నీరు ఆయుధమంటారు, మీరేమంటారు?

 జఃఏమో, నాకు మాత్రం కాదు.

 జగన్నాథరావు విజయనగరం.

 ప్రః    ఇద్దరు మార్వాడీలు కలుసుకుంటే హిందీలోనే మాట్లాడుకుంటారు? ఇద్దరు    సాహెబులు కలిస్తే ఉర్దులో మాట్లాడుకుంటారు-తమిళులు ఎపుడూ తమిళమే  మాట్లాడుతారు. కాని ఇద్దరు తెలుగువారు కలిస్తే వచ్చీరానీ ఇంగ్లీషులోనే  మాట్లాడుకుంటారెందుకండీ?

 జ. మనకర్మ!

 టి. గౌరీదేవి యానాం.

           ప్రః మా బాబుకి చదువు రావడం లేదు .ఏం చేయాలో తోచటంలేదు, మీ సలహా  ఏమిటీ?

  జఃమీ బాబుకు ఎందులో అసక్తి వుందో గ్రహించి, ఆ విద్యకు ప్రోత్సాహమివ్వడం  మంచిది. కొట్టడం తిట్టడం  మాత్రం చెయ్యవద్దు .దాని వలన   ప్రయెజనం కలగపోగా బాబుని మొండివాణ్ణి చేసిన వారవుతారు.

 యాండ్రవు సత్యనారాయణ గదెలవలన.

           ప్రః ఆంధ్రలో మీరు నాటక ప్రదర్శనలు యిస్తామన్నారు. ఎప్పుడు?

జః 1968 లో.

దేవళరాజా సత్యనారాయణరావ్ బందరు.

           ప్రఃఇటీవల విజయవాడలో శ్రీ గుమ్మడి ఒక సభలో మాట్లాడుతూ కళాకారులకు ప్రభుత్వం తగినంత గౌరవం యివ్వడం లేదు అన్నారు... మీరేమంటారు? 

జః ఆంధ్ర ప్రభుత్వం మాటగాదేమో వారన్నది. కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకుని   మాట్లాడారనుకుంటున్నా.

కె. సూర్యనారాయణ. పిసిమికాడ.

           ప్రః ఈ (ఆ) కలికాలంలో సన్యాసం మంచిదా? సంసారం మంచిదా?

జః ఇంకా వేరే సన్యాసం ఎందుకు?

సి. ఎస్ ఎన్. మూర్తి కొయ్యాలగుడెం,

           ప్రః  కళారాధనే దృష్టిలో పెట్టుకుని నిర్మించే చిత్రాలు ఆశించినంత  ఫలితం మరి పొందగలవా?

జః లేవు.

వై.ఆంజనేయులు గుంతకల్లు.

           ప్రః స్త్రీ హృదయం సెలయేటి వంటిదంటారు కొందరు. నాతి హృదయం  రాతివంటిదంటారు కొందరు. ఎందుకు?

జఃనిర్మలమైనది కాబట్టి సెలయేరుతో పోల్చివుంటారు. నిశ్చిత హృదయిని కాబట్టి రాతితో తూచివుంటారు.

వై.వెంకటరత్నం పద్పపురం.

           ప్రః ఎందుకు శీర్షికలో పద్మనాభంగారు ఒక ప్రశ్నకు జవాబుగా అరవ సాంబారుకు, ఆంధ్ర ఇడ్లకి పొత్తు వారికన్నా మీకే బాగా తెలుసునన్నారు ,  మరి ఆ సంబంధం ఏమిటో చెబుతారా?

జఃసాంబారు , ఇడ్లీ మనవి గానేగావు, మన సంప్రదాయం, పెసరట్ అండ్  ఘుమ ఘుమ ఉప్మా!

ఇ. టి. రామరావు కావలి.

           ప్రః Experience is the best teacher అన్నారు గదా? మరి మీ సినీజీవితంలో మీరు నేర్చిన పాఠం ఏమిటో?

జః నా జీవితానికి కావలసినవి, నాకు తెలియనివి అన్నీ నేను సినీ జీవితంలోనే  నేర్చుకున్నాను.

           ప్రః నేడు ఉత్తమ చిత్రాలు రాక పోవడానికి ప్రేక్షకులు ఎంతవరకు భాధ్యులు?

జఃసినిమా పరిశ్రమకు ప్రజాదరణే ప్రధానం గదా,s అందుకే ఏనాటి సినిమాలకైనా బాధ్యత పూర్తిగా ప్రేక్షకులదే.

అల్లంరాజు లక్ష్మీనారాయణ్. టిట్లాఘర్.

           ప్రః మోడువారిన వృక్షాలు వసంతకాలంతో చిగురించి పుష్పిస్తాయిగదా? అలాగే    మోడు వారిన హృదయాలు చిగురించే ఆశ లేదా మాధవిగారూ?

 జః ఉంది... ఎందుకులేదు?

 జి. పద్మావతీదేవీ. మద్రాస్.

       ప్రఃఏమండి మా ప్రశ్నలకు మీరే స్వయంగా ప్రత్యుత్తరములిస్తున్నారా, లేక  వేరెవరైనా మీ పేరున సమాధానాలిస్తున్నారా?

 జః ఔనూ ఇంతకీ మీరీ ప్రశ్న మీరే వ్రాస్తున్నారా? ఎవరైనా మీ పేరుతో వ్రాశారా?

           ప్రః మీ నాటక సమాజం ఏమయింది?

 జః కొంచెం ఓపిక పట్టండి. వచ్చే సంవత్సరం నాటక ప్రదర్శనలివ్వాలని ఏర్పాట్లు  చేస్తున్నాను.

 పి. సాంబశివరావు. హైదరాబాదు.

           ప్రః మీ వారికి తెలుగు మాట్లాడటం వచ్చా?

 జః ఓ బాగా మాట్లాడుతారు.

           ప్రః మరి  తెలుగు చిత్రాలలో నటించరేం?

 జః ఆయనవరకు ఏ అభ్యంతరం లేదు.

 బి. ఆర్. రావు వైరా.

           ప్రః ఒకసారి అమాయకత్వంలో పోగొట్టుకున్న హృదయంలో మరో సారి  యింకొకరికి స్థానం యివ్వగలమా?

 జః అంత సులభంగా పోయే హృదయం ఎన్ని సార్లైనా అల్లా పోగొట్టుకుంటూ, మరొ కరికి చోటు కలిగిస్తూనేవుంటుంది.

  మిస్ ఎవడ్. బి. బిర్హంపూర్.

           ప్రః  వెంపటి సత్యం గారి వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకోవాలని వుంది.  స్కాలర్షిప్ వచ్చేందుకు  ఏర్పాట్లు చేయగలరా? యోగ్యత. అర్హత నా  కున్నాయనుకుంటున్నా.

 జః సత్యంగారి విద్యాలయం ప్రభుత్వ నిర్వహణలో లేదు; ప్రైవేట్సంస్థ: స్కాలర్  షిప్స్ లేవు. ఆశ్రయించి ఉచితంగా నేర్చుకునే శిష్యురాండ్రు కూడా వున్నారు  అక్కడ.

 కె.యన్. అర్. సురేందర్. మంచిరియాల.

           ప్రః స్త్రీల మనస్తత్వాలెలావుంటాయి?

 జ. అతి సున్నితంగా వుంటాయి.

           ప్రః స్త్రీ పురుషుల్లో ఎవరు కఠినాత్ములో నిజం చెప్పండి?

 జ. నాతి హృదయం రాతి వంటిదని అన్నారొకరు ఇంతక్రితమే.

ప్రః  స్త్రీ మనసు గ్రహించక ఆమెను ప్రేమిస్తే, ఆమె నిరాకరిస్తే  పురుషుడు ఎంత బాధ   పడతాడు. అలాంటపుడు స్త్రీ తన మనస్సు ఎందుకు మార్చుకోదు?

 జః ఎదుటివాని మనస్సు తెలుసుకోకుండా తొందరపడడం మొదటి పొరపాటు.  స్త్రీ మనసు మార్చుకోవాలనుకోవడం మరింత పొరబాటు.

 రాగతీ పండరీభాయి, విశాఖపట్టణం.

  ప్రః మానవుని జీవితంలో అతి సుఖమైన క్షణం ఏది?

 జ. ఆత్మకి తృప్తి కలిగినప్పుడు.

           ప్రః ఈ ప్రపంచంలో మానవుడు డబ్బుతో సాధించలేనిదేమిటి?

 జః ఏమిటి? ఈ కాలంలోనా?

           ప్రః మీరు జవాబివ్వలేని ప్రశ్న ఏది?

జ. అమ్మో తీరా చెప్పాక మీరు అడిగేస్తే?

డి. వెంకశ్వర్లు. వరంగల్.

           ప్రః మీ అడ్రస్?

జః 11 హబీబుల్లా రోడ్ మద్రాస్. 17.

జంచాలి సన్యాసి రాజు. పార్వతీపురం.

 

           ప్రః నటినటులు పాత్రలో లీనమై నటించడం మంచిదా? తమ పాత్రలను దృష్టిలో  వుంచుకుని నటించడం మంచిదా

?    జః రెండోదే కరెక్ట్.

           ప్రః మీ వంటి సినీతారలు నా కలలో కనిపించి నిద్రాభంగం చేస్తుంటారు; దానికి  తరుణోపాయం?

 జః మా కలల్లోకి మీరు రానంత వరకూ ఏ ప్రమాదమూ లేదు, గ్యారంటీ.

 సి శ్యామల. హైదరాబాద్.

           ప్రః ముద్దులు ప్రవేశ పెట్టాలా వద్దా అన్న విషయం ఎప్పటికి తేలుతుంది?

 జః అంత తేలికగా తేల్చేస్తే మన కమిటీల ఘనత ఏముంటుందింక.

           ప్రః పెద్ద తారలంతా వద్దంటే ( ఈ ముద్దులు ప్రవెశ పెట్టడం) నిర్మాతలు, దర్శకులు   ఏం చేస్తారండి బహుశా ఆ పద్దతి రద్దు చేస్తారా?

 జః చేయరు, అల్లా అంగీకరించే  తారలతోనే చిత్రాలు తీస్తారు..

 కుమారి సునీత పట్నాయక్. బర్హంపూర్.                                          

           ప్రః మొన్నటి ఎన్నికల్లో ఓటిచ్చిన వారిలో అందరికన్న పెద్ద వారెవరు మీ   యింట్లో?

  జః మా అమ్మమ్మ.

           ప్రః గీతాంజలికి పద్మనాభానికీ ఈడూ జోడూ బావుంటుంది. మీరేమంటారు?

  జ. గీతాంజలిని నడిగి చెప్తా మరి.

  మదాల అచ్చయ్య. చల్లపల్లి.

           ప్రః అన్నా, చెల్లిలా వుంటున్న ఆ యిద్దరూ విడిపోయేటప్పుడు ఒకరికొకరు    యివ్వవలసిందేమిటి?

 జః ఆ సంబంధంలో బంధం మనుష్యులు విడిపోయినా అది వీడిపోదు,   ఒకరికొకరు ఆ అనుబంధం యిచ్చుకోవడమే.

  యం.  వరలక్ష్మి, పూలపల్లి.

           ప్రః ఆరాధన చిత్రంలో మీ పాత్ర మరువలేను, అది నా జీవితాన్నే మార్చింది.

  జః అనురాధ పాత్ర అల్లాంటిది,

  పి. లక్ష్మి, నింపూరా.

           ప్రః ఇంతమంది తెలుగువారుండగా, తమిళుని వివాహమాడారేం?

  జః అనురాగానికి, అనుకూలతకు భాష అడ్డురాదుగా?

  ఏ రాజబాబు, బందర్.

           ప్రః మీపై ఎంతో గౌరవం వున్నా మీరు ధరించే ప్రతి పాత్రను నేను   అభినందించలేను కంచుకోట చుస్తూంటే.....

  జః బ్రదర్ ఆ అభిమానానికి thanks  ఆ అభిప్రాయాన్ని కాస్త ఆ నిర్మాతకి    వ్రాయకూడదూ? 

  యస్. త్రివేణి, ఖర్గపూర్.

           ప్రః మీరు నిర్మించబోతున్న చిత్రానికి మీరే కథ వ్రాస్తున్నారా?

  జః లేదు, శ్రీమతి వి. సరోజని వ్రాసిందా కథ. ఆత్రేయ మాటలు వ్రాస్తున్నారు.

 ఎం. సూర్య, జమలమడుగు.

ప్రః ఏ చిత్రంలోనైనా  నీ పాత్రకు అన్యాయం  జరిగితే నా కెంతో బాధ   కలుగుతుంది ఎందుకని?

 జః అత్మీయత ఆల్లాంటిది- అందుకని.

  ఆర్, సాంబశివశర్మ, నై వేలి-2.

ప్రః మీకే పాత్రలంటే యిష్టం?

  జః చిత్రంలో నేను ఏడవకుండా మిమ్మల్ని ఏడ్పించగలిగే పాత్రల పోషణ అంటే చాలా యిష్టం.

  కె. కె. ఆనందం. తిమ్మందర్ల.

ప్రః  నాకు నటించాలని వుంది. మీ చిత్రంలో ఒక ఛాన్సు యిస్తారా?

 జః ఈ చిత్రంలో ఆ ఆవకాశం లేదు.  సారీ.

 జి. ఉమకాంత్, వరంగల్లు. 

ప్రః ఈ రోజుల్లో విలువగల వారెవరు?

 జః నోరు పెట్టుకుని నెగ్గుకొస్తున్నవాళ్ళు.

 బి. త్రినాథ్, బొబ్బిలి.

 ప్ర. మీతో నేనొక చిత్రంలో హీరోగా నటించాలని ఆశగా వుంది. మీరు   ఒప్పుకుంటారా?

 జః ఓ ... నాకేమి అభ్యంతరంలేదు. పోతే, ఆ ప్రొడ్యూసరు, డిస్ట్రబ్యూటరు, అంగీకరించాలిగా. 

 పి. మహేష్. శ్రీకాకుళం.

ప్రః నటులకు, ప్రేక్షకులకుగల సంబంధం?

 జః విద్యార్థులకు, పరీక్షాధికారులకు గల అనుబంధమే.

 ఎం. సి, రావు కొడాలి.

ప్రః  ధనం, రూపం, గుణం. విద్య. అన్నీ వున్నా, మంచి కుటుంబంలో పుట్టినా,  ఒక అమ్మాయికి వరుడు లభించడంలేదు. ఏం చేయాలి? 

 జః నక్షత్ర బలాలెలావున్నాయో, ఏమో? ఓ మాటు ఎవరికైనా ఆ అమ్మాయి  జాతకం చూపించండి.

 సాకా రాజేశ్వరి బరంపురం,

 ప్రః భగవంతునికి అతి ప్రియమైనదేది?

 జః నిష్కల్మషమైన ఆరాధన.

 ఎన్. సంజీవరావు, కరీంనగర్.

 ప్రః ఈ ప్రపంచంలో పరమ సత్యమేది?  ఘోర అహింస ఏది? జరగరాని అపచారమేమి?

 జః ఈ ప్రశ్న ఏమీ? ఈ సందేహ మేమి?ఈ రాత యేమి?

 కె. వి. రమావేణుగోపాలరావు- సర్వరెడ్డిపాలం.

ప్రః మీకు ఏ పార్టీ అంటే యిష్టమండి? కారణం చెప్పండి?

 జః టీ పార్టీ అంటే.  గెట్‌ టుగెదర్లో కాలక్షేపం, కాఫి ఫలహారాలూ దొరుకుతాయిగా.

 జి.అప్పారావు, కుందంగి.                                                     

 ప్రః     నా జీతం 120 రూపాయలు. నాకు నలుగురు పిల్లలు, నేనెంత పొదుపు   చేయాలనుకున్నా మా ఆవిడ దుబారా మనిషయింది, ఎల్లా?

 జః పొదుపుకు స్త్రీలు పెట్టింది పేరు. చెప్పి చూడండి నెమ్మదిగా, మీకంటే గొప్పగా పొదుపు చేయగలదేమో. 

 వి. యస్.రావు. కావలి.                                                                 

 ప్రః ప్రస్తుత ఆహర పరిస్థితిలో స్త్రీలోక బాధ్యతలు ఏమిటి?

 జః దుబారా లేకుండా, ఎకనామికల్ గా సంసారాలు నడపడం...

 బి. కృష్టకుమారి పాలెం.

ప్రః  తల్లీ తండ్రీ, లేరు నాకు, చిన్న పాఠశాలలో పని చేస్తున్నాను. మా వాళ్ళంతా  పెళ్ళి చేసుకోమని పట్టుపడుతున్నారు. నేను హీందీ చదువుకోవాలని   తలుస్తున్నా. ఏమి చేయమంటారు?

 జః పెళ్ళికి, మీ హిందీ చదువు ఏమీ అడ్డం రాదుగా.

కుమారి దానరిరాజు, నూజివీడు,

 ప్రః అమాయకురాలైన ఆడపిల్లపై అపనిందలు వేస్తే?

 జః అమాయకత్వం పోగొట్టుకోవాలి ముందు.

 సుధశ్రీ, రాజమండ్రి,

 ప్రః నడిగియర్ తిలకంఅంటే?

 జః నటీ శిరోమణి అని తెలుగులో చెప్పాలి.

 జి. ఆర్ మౌళి- మంచిర్యాల.

ప్రః సృష్టిలో స్త్రీ ముందు పుట్టెనా? పురుషుడా?

 జః ప్రకృతిని స్త్రీ గానే చెబుతారు పెద్దలు, ఈవ్ తర్వాతే యాడం స్త్రీ తర్వాతే    పురుషుడు.

 ఎం. శేషారత్నం, మందమర్రి.

 ప్రః తెలిసినవారు అంత దూరంలో వుండగానే ఒకరినొకర్ని చూచుకుని   నవ్వుకుంటారేమండి?

 జః మాటలతో పలకరించుకొనే అవకాశం లేక మనస్సుతో పలకరించుకునేందుకు అదే సాధనం మరి.

 ఎ. లక్ష్మణకర్, బొబ్బిలి.

 ప్రః ఏదైనా ఒక కార్యం తలపెట్టి అపజయాన్ని పొందితే మనిషి తేరుకొ       ని పూర్వంలా   తిరగగలుగుతాడా?  

 జః అందుకే మనకి మరుపు యిచ్చాడు భగవంతుడు .ఆపైన మనో ధైర్యాన్ని మనం కలిగివుంటే ఆరోగ్యం.

 కొత్త శివరామకృష్ణ ప్రసాద్, వేజండ్ల.

 ప్రః ఈ ట్వంటియత్ సెంచరీలోని అప్ టు డేట్ ఫ్యాషనబుల్ నవయువతులపై  మీ ఆభిప్రాయం?
 జః మరి ఆ నవయువకుల మాటో
?

 యస్. గౌరీపార్వతి, మచిలీపట్నం.

ప్రః హిందీ చిత్రాల్లో నాచురాలిటీ తెలుగు చిత్రాలలో కనిపించదేం?

 జః అదే ప్రశ్న నేనూ అడుగుతా మన చిత్రాల్లో వున్ననాచురాలిటి హిందీలో ఎక్కడవుందని? 

 యం. సుజావద్దీన్, ఇస్లాంపూర్.

 ప్రః స్త్రీ ఇంటి దీపమా?

 జః ఆః..ఇల్లాలే యింటికి దీపం.

ప్రః పెళ్లి ఎందుకు చేస్తారు?

 జః సంసార జీవితం వుంటే సమాజ సంరక్షణ జరుగుతుందని.

 ప్రః మీరు నటించిన, నటిస్తున్న హిందీ చిత్రాలేమిటి?

 జః జాయ్ ఫిలింస్ బలరాం శ్రీకృష్ణ లో నటిస్తున్నాను. గంగా కి లహరే, ఘర్ బసాకే దేఖ, బహుత్ దిన్ హుయే మొదలయిన హిందీ చిత్రాలలో నటించాను.

 పి. యస్. వి, సంజీవరావు. పాలకొండ.

 ప్రః కళాకారులు దేశాభివృద్దికెంతవరకు బాధ్యులు?

 జః సమాజానికి సినిమా ప్రతిబింబం. ఆ సమాజానికి చరిత్రకారులు కళాకారులే,   అనుక్షణం మార్పులు వస్తున్న దేశ, కాల, వాతావరణాలను యథాతథంగా గుర్తించడానికి సినిమాలే ప్రత్యక్ష ఆధారాలు, ఏనాటి కైనా.

 హెచ్. ప్రసాద్. గుంటూరు.

ప్రః మీరు నిర్మించే చిత్రంలో నటీనటులెవరు?

 జః జగ్గయ్య, జమున, జానకి, సూర్యకాంతం, రేలంగి, పద్మనాభంబేబి  రోజారమణి.

 హెచ్. కె. ఆచారి. ఆదోని.

ప్రః  తాను నటించే పాత్రలో లీనమై నటించాలా ,పాత్రకు జీవం పోస్తున్నాననే  అనుభూతితో నటిస్తే బాగా నటిస్తారా?

 జః రెండోదే కరక్ట్....

 ప్రః  నాటకరంగం, సినిమారంగం ఈ రెండిటిలో నటనౌచిత్యానికి ఏది బాగా దోహదపడుతుంది?

 జః ఔచిత్య నిరూపణకు రెండూ ఒకటే.

 ప్రః మనసే మందిరంలో  మీ నటన నాకు బాగా త్పప్తినిచ్చింది. 

 జః ఏం ప్రయోజనం: నిర్మాతలను తృప్తి పొందించలేక పోయ

 కావలి వసంత. తంబళ్లపల్లె.

 ప్రః అక్కా,  ఒక స్త్రీ అదృష్టం వలన ఉన్నత స్థితికి వచ్చినా, దురదృష్టం వలన  దిగజారిపోయినా ఆమెను ఎక్కువగా పొగిడేవారు, ఏడిపించే వారు స్త్రీలేగాని   పురుషులు కాదంటాను. కారణమేమిటీ?

 జః అదేగా, ఆడవాళ్ల బలహీనత.

  సి, భారతీదేవి, పచ్చలతాడిపర్రు.

ప్రః  లావు తగ్గుటకు చన్నీళ్ల స్నానం చేయుచున్నారా?

 జః చన్నీళ్ళ స్నానం వల్లనే సన్నబడతాననుకుంటే మా యింట్లోవున్న   ఫ్రిజడెరిలోనే కూర్చుందును.

 యర్ర మల్లఖార్జునరావు. కొత్తపేట.                                                            

 ప్రః మీరు మీ భర్తతో నటించేటప్పుడు ఏవిధమైన అనుభూతి పొందుతారు?   మరొకరెవరితోనైనా నటిస్తుంటే ఎలాంటి అనుభూతి కల్గుతుంది?

 జః నటించడానికి  సెట్స్ మీదకు వెళ్ళితే పాత్ర స్వభావంతో ఆ దృశ్యంలో   నటించవలసిన ఎమోషన్ తెచ్చుకొని వుంటాం. అప్పుడు ఎవరితో నటిస్తున్నా   ఒకటే అనుభూతి. ఆ తేడాలుండవు.

 కె. నీలకంఠం, సాలూరు.

ప్రః మాతా సంస్థకు మీరు దర్శకత్వం వహిస్తున్నట్లే చక్రవర్తి చిత్రాలకు నటసామ్రాట్   దర్శకత్వ బాధ్యత వహించ కూడదా?

 జః నటసామ్రాట్‌గారే చెప్పాలి నన్నడిగితే...

  జి.     కోటిరెడ్డి. బరోడా.

ప్రః బీహార్ క్షామనిధికి మీరేమైనా సహయం చేశారా?

జః     స్టార్‌నైట్ జరిపి ఆ కలెక్షన్ పంపాం.

  సి. గంగాధర్, భాన్స్‌వాడ.

ప్రః    మీ ఆరాధ్య దైవం ఎవరండీ?

జః     వెంకటేశ్వరస్వామి ,విఘ్నేశ్వరుడు.

ప్రః    ఆడవారికి పువ్వు లంటే అంత యిష్టం ఎందుచేతనంటారు?

జః     పుష్పానికి పూబోడికి దగ్గర సంబంధాలున్నాయి మరి.

 యుగంధర శ్రీ- హైదరాబాద్.

ప్రః   నటజీవితంలో మీరు తెలుసుకున్నదేది? నేర్చుకున్నదేది?

  జః   కృషితో సాధించలేనిది ఏదీ లేదని.. ఆత్మ విశ్వాసంతో బ్రతకడం.

ప్రః విశాల విశ్వంలో అతి ఉన్నత మైనది, అతి నికృష్టమైనదేది?

జః     పరుల గౌరవించడం, ప్రేమించడం! ఆత్మ స్తుతి- పరనింద.

సి.మహేష్. జగపతినగరం,

ప్రః      జీవితంలో స్త్రీ ఎవరిని అమితంగా ప్రేమిస్తుంది?

జః     తన భర్తను.

  ఏ. కనక సుందరరావు మంగళగిరి.

ప్రః చాలా సార్లు నారాయణ జపం చేస్తే పాప పరిహరం వుందా: కష్టాలు తొలిగి  పోతాయా?

జః     ఊహూఁ.

  జి, సుదర్శనరెడ్డి ఇస్సావల్లి.

ప్రః   మీకు ఈత వచ్చునా?

జః     బాగా వచ్చు. 

ప్రః మీ విజయను ఆర్టిస్టు చేసే ఉద్దేశం ఉందా?

జః     ఇంతవరకు లేదు,

ఆర్. అనసూయ మందలపర్రు.

ప్రః   నవరాత్రి చిత్రం తర్వాత మీరే చిత్రంలో నైనా మళ్ళీ పాడారా?

జః     లేదు.

జి.     బేబీలక్ష్మి- తెనాలి,

ప్రః  మీ నట జీవితం, మీ ఆశయాల కెంతవరకు సహకరించ గలదంటారు?

జః జీవితంలో నేను తెలుసుకోలేనిది నేను నటించే పాత్రల ద్వారా తెలుసుకోగలుగుతున్నాను.

  యస్. సత్యనారాయణ మంచిరియాల.

ప్రః  సినిమాలో కోడలుగా నటించడం మీకు తేలిక. నిత్యజీవితంలో ఎంతవరకు... ?

జః     మీ దయ వలన మా అత్తగారు సూర్యకాంతమ్మత్తయ్య కాదులెండి.

  బి. ప్రభాకరరావు , మంచిర్యాల.

ప్రః   మీ సినిమా నటజీవితానుభవంతో మీ జీవితం గురించి ఒకే వాక్యంలో చెప్పాలిమరి?

జః     An artist’s life is not a bed of Roses.

  జె.     కృష్ణకూమారి- ఆకిరిపల్లి.

ప్రః  పిల్లలను సక్రమ పద్దతిలో వుంచవలసిన తండ్రే తప్పుడు దారినపడితే ఆ తండ్రి   నేమనాలి?

జః     అదే నిజమైతే ఛ, అతను తండ్రి కాదు.

  టి. రత్నం- విజయనగరం.

ప్రః     మద్రాస్ వస్తే నాతో మాట్లాడుతారా?

జః   తప్పక ... కేవలం మాట్లాడానికి మాత్రం అంత దూరం ప్రయాణం పెట్టుకోవద్దు.

  టి. రవీంధ్రనాథ్, కర్నూలు.

ప్రః ఇతర నటీనటులపై మీకు ద్వేషం వుంటుందా? ప్రేమ వుంటుందా?

జః  బలేవారే! అదేమిటాప్రశ్న... ఆ సందేహం ఏమిటి?

ఎం. తేజొపతి-తిరుపతి.

ప్రఃమీరు తెలుగువారై వుండి తమిళుని పెళ్లాడారు మీకు తగిన అందగాడు, సంస్కారి,   నటశేఖరుడు తెలుగువారిలో లేరనా? మరి శ్రీ జెమినీలో వున్న ప్రత్యేకత, సద్గుణాలు ఏమిటో?

జఃమీ అందరికీ, మీ అభిమాన నటిగా యింత వరకు వుండగలిగానంటే దానికి వారు కూడా   ఒక ముఖ్యకారకులు.

పొలిమేర రామారావు అనకపల్లి.

ప్రః  నాకు కథ వ్రాయాలని వుంది.

  జః   కాగితం , కలం వుందిగదా అనా? బుర్ర కూడా అవసరం మరి.

కె. చంద్రశేఖర్, కాకినాడ.

ప్రః నేను ప్రేమించిన అమ్మాయికి ఏ లోపమూ  లేదు, కాని మీలా లావుగామాత్రం        వుంటుంది. వివాహం చేసుకుందామనుకుంటున్నాను. ఏం చేయమంటారు?

  జః  దగ్గర్లోనే సైకిల్ షాపుంటే చూడండి, గాలి కొడితే మీరు లావెక్కొచ్చునేమో?

అరసివెల్లి సత్యవతి, చినవాల్తేరు.

ప్రః ఉత్తమమైన ఈ మానవజన్మ దొరకడమే చాలా కష్టమంటారుగదా: అలాంటి జన్మను   సద్వినియోగం చేసుకోరెందుచేత?

జః     స్వార్థమనే మబ్బుతెరలు దిట్టంగా పట్టేయడం వలన.

  బి.     కృష్ణమూర్తి. కొత్తగూడం.

ప్రః మీరు అన్నిచిత్రాల్లో విషాదకర పాత్రలే నిర్వహించి ఏడుస్తూ, ఏడిపిస్తూంటారు, మీ     చిత్రాలుచూచి ఎల్లాగో అయిపోతాము. తేలిక పాత్రలు నిర్వహించలేదా?  నిర్వహించలేరా?

  జః  నటికి అన్నీ ఒకటే, ఆ ప్రశ్న తెలుగుచిత్ర నిర్మాతలనడగండి.

   జి. ఎం. వి, సుబ్బారావు. తాడేపల్లి గూడెం.

ప్రః మనిషికి దేనివలన గర్వము వచ్చును?

 జః   ఇది రెండు రకాలుగా రావచ్చు. విజయ సాధన వలన వచ్చేది ఒకటైతే, విర్రవీగటంతో మిగిలేది మరొకటి.

ప్రః ఇల్లాలి  ముచ్చట్లు ఎపుడూ  పురాణం సీతగారే వ్రాయాలా?  మేం వ్రాసి  పంపితే ప్రచురించే  అవకాశం  లేదా?

జః అవకాశం  తప్పక  వుంటుందని  నా  అనుమానం . ఎడిటర్  గారికి  వ్రాయండి  ఈ విషయం.

కె, విజయ, అనకాపల్లి.

ప్రః వివాహమయి  పిల్లలుగల  జెమినీ  గణేశన్  గారిని  మీరు  పెళ్లాడారు,  . దావివలన  తోటి స్త్రీకి  అన్యాయం  చేసినట్లు  కాదా?

జః  దక్షిణాదిన ఓ  కథ వుంది  ప్రచారంలో.  విఘ్నేశ్వరుడికి  సిధ్ధి , బుధ్ధి అని  యిద్దరు  భార్యలట , అలాగే  మా  గణపతి  (గణేశ్ ) గారికి  కూడా.

ప్రః అవివాహితులైన  అందమైన  యువకులు  మీకు  లభించ లేదా?

జః నా  కళ్ళకు  లభించలేదు.

వజ్జె  జాన్  లక్ష్మణరావు , మచిలిపట్నం.

.ప్రః నేను  ఈ లోకాన్నిచూచి  ఎందుకు  భయపడాలి?

జః ఔను , ఎందుకు  భయపడాలి?

ఎల్,ఎస్.మహలక్ష్మి, బందరు.

.ప్రః ఎన్నివున్నా  మనస్సులో విషాదవారం  తప్పడంలేదు  ఎందువలన?

జః తృప్తి  అనేది  వుంటే  విషాదం వుండదు.  ఆశా భంగమూ  వుండదు.

పి. సునీత  పెదప్రోలు.

ప్రః .......................................

జః మీ బాధ అర్థమయిందిః  ఆంధ్ర  మహిళా  సంస్థలో  ఏదైనా  ట్రైనింగ్  అవండి.

జి, విశ్వనాధం  కాళహస్తి,

.ప్రః ఉత్తమ  నటి  లక్షాణాలు ఏమిటి?

జః తనకిచ్చిన  పాత్ర  అర్ధం  చేసుకుని  నటించడమేగాక, ఇక్కడి చిత్ర  పరిశ్రమ  సాధక  బాధకాలు  కూడా  తెలుసుకొని  మసలుకోగల  వారే  ఉత్తమ శ్రేణికి  చెందిన  నటీనటులు.

జి. గంగరాజు  పార్వతీపురం.

.ప్రః నేటి  సినిమాలు  విద్యార్థుల  నైతిక  క్రమ శిక్షణ  పాడుచేస్తున్నాయంటాను. మీరేమంటారు?

జః నేననుకోవడం    యువకుల వలనే  నేటి  సినిమాలింత  పాడవుతున్నాయని........

కేశవ  ప్రభాకర్,  కొవ్వూరు.

ప్రః మీక  ాబోయే  అల్లుడికి  కావలసిన  అర్హతలు  తేలియజేస్తారా?

జః అల్లుడి   సెలక్షన్  రోజులు  కావుయివి. ఆయన సెలక్షన్   డైర్ క్ట్ గా!  అయినా  మా  అమ్మాయినడిగి  చెప్తానుండండి.....

పద్మాలయ పండా, జగదేవుపురం.

.ప్రః స్త్రీలకు  విద్య ఎంతవరకు  అవసరం?

జః సామాన్య  పరిజ్ఞానం  సముపార్జించి , లోకాన్ని  అర్థం  చేసుకునే  వరకు.......

బి. ఎన్ . కె. పండా , కాశీబుగ్గ.

ప్రః మీరు ఎన్. టి. రామారావుగారితో  నటించిన చిత్రాల్లో  మీకు  పూర్తిగా  నచ్చిన  చిత్రం  పేరు  చెప్పగోర్తాను.

జః మిస్సమ్మ , రక్తసంబంధం.

సింగము  నూకరాజు . అనకాపల్లి

ప్రః స్త్రీ  పురుషులెవరైనా సరే  ప్రేమసాగరములో   పడిన తర్వాత  ఎన్ని  కష్టాలొచ్చినా  భయపడరెందుచేత?

జః నిండా  మునిగారుగా  మరి.

.ప్రః మీకు  డిటెక్టివ్  సాహిత్యం  యిష్టమేనా?

జః ఇష్టంలేదు.

ఎన్. గపూరి. నందికొట్కూరు.

.ప్రః  మనసే  మందిరం  చిత్రంలో  మీపాత్రను  చూస్తూంటే  కన్నీరు  పారింది.  మరి  మీకో?

జః షూటింగ్  జరిగిన ఆ  నెలరోజులు  ఏడ్చి,ఏడ్చి కళ్ళు, మొహం  వాచి పోయాయి  నాకు.

ఎం . కమల  . పేరాల.

.ప్రః త్రాగుడుకు  ఎందుకు  దాసులైపోతారో?

జః కాసేపైనా  గంధర్వులై  దేవ లోకంలో  తేలిపోదామనేమో.

కోనారి  బాబురావు . ఖరగ్పూర్.

ప్రః వయసులో వున్న  యవకుణ్ణి  చూడగానే , యువతులు  తమ  చేతుల్లో వున్న  చంటి పిల్లను  గట్టిగా  ముద్దు  పెట్టుతుంటూ  వుంటారు,  ఎందుచేత?

జః ఇదేదో  కొత్త  అనుభవంలా  వుందే.

నందిగామ  కాశయ్య.  హుజూరీన్సరి.

ప్రః సుఖదుఃఖములతో  కూడిన    మానవ  జీవిత  సందేశం  ఏమిటి?

జః వాటికతీతులై  బ్రతకమని.

యస్, కృష్ణమూర్తి  భువనగిరి.

ప్రః  మీ ప్రోత్సాహముంటే  విలన్ గా చిత్రాల్లో  నటించాలని  వుంది.

జః  శ్రీ  మాతాఫిలింస్,    9.  ఫస్ట్  క్రాస్  స్ర్టీట్, మౌబరీస్  రోడ్ . మద్రాస్  18 ,కి పోటో,  ఉత్తరం  వ్రాయండి . మీ అదృష్టం ఎల్లాంటిదో మరి.

ఎం. లింగనాయుడు,  పిసినికాడ.

ప్రః శీతాకాలంలో కుడా  విద్యార్థులు  క్లాసులోకి  రాగానే  కాలరు ఎత్తి  చొక్కా  బొత్తాలు  తీసి కాలర్  పైకి  ఎత్తుతుంటారు. ఫోజా? సాటి  విద్యార్దినులనాకర్షించడానికా?

జఃకాలర్లెత్తే వారికి ఓ కాలమని ఏముంటుంది?

 వెంకటేశం,  తిమ్మనచర్ల.

ప్రః ఆస్తినంతా  చదువుకొసం  ఖర్చుచేసి,డిగ్రీ తెచ్చుకుని,  ఉద్యోగం  దొరక్క  ఉసూరుమనే  వారికి  మీ సలహా  ఏమిటి?

జః చదువుకు సార్థకం  తెలిసి , బ్రతుకుతెరువుకు  ఉద్యోగం  ఒక్కటే  మార్గంకాదుగా,సృజనాత్మక శక్తి వుంటే  ఎల్లాగైనా  బ్రతకవచ్చు.  ఏ వృత్తిలోనైనా  రాణించవచ్చు.

లింగం  పట్టాభిరామయ్య , అక్కయ్యపాలెం.

ప్రఃనేటి చిత్రాలను చూస్తూ వుంటే  నిర్మాతలు  ప్రజాభిప్రాయాన్ని గుర్తించటం లేదని నేనంటే మీరంగీకరిస్తారా?

జ. ప్రజాభిరిచులు  త్వరత్వరగా  మారి  పోతూండడం వల్ల, ఇల్లా  యిబ్బంది  పడిపోతున్నారు.

ప్రః జంటతనంలో  అనురాగమును, అభిమానమును  పెంపొందుటకు  పెద్దలు పెళ్ళి  అనే  జీవిత  బంధాన్ని  స్త్రీ పురుషులకేర్పరచారు . నిజమేనంటారా?

జః ఆనాడు  వంశ వృక్షం  పెరగాలనుకొని  పెట్టారానిబంధన . ఈనాడది  విషమించింది.  కుటుంబ  నియంత్రణ  అమలు  చేసుకోవలసి  వస్తోంది.

ప్రః మనిషికి , మనిషికీ  మధ్య  మమతలు  నశించి  మానవుడు  దానవుడిలా  తయారౌతున్నాడు  నేటి  సంఘంలో.  ఔనంటారా?

జః తనపై  తనకు  మమత  పెంచుకుంటున్న  తరుణంలో  స్వార్థ  జీవనం  తప్పదు    సంఘంలోనైనాసరే.

మేకల  మాధవరావు ,చందర్లపాడు.

ప్రః మీ  విజ్జిని   పెళ్ళి  చేసుకోవాలని  వుంది.

జః హుహుహ్హూ...................

ఎం. వి. యస్. రావు  కొత్తగూడెం.

ప్రః మీరు  సినిమాలలో  నటించాలని  ఎందుకు  కోరుకున్నారు?

జః మీ  అందరిచేత  మెప్పులు పొందాలని........

ఎం రుక్మిణీదేవి  పరిటాల.

ప్రః మానవుడు  జీవితాంతం  వరకు  ప్రశాంతంగా  గడపాలంటే  ఏం  చెయ్యాలి?

జః తృప్తి కలిగి   ఆవేశాలకు  లొంగక  బ్రతక  గలిగితే  చాలు.

వై . వెంకటేశ్వరరావు.  మాచెర్ల.

ప్రః కళ  అనగానేమి?

జః ఎంతటి  వారినైనా  కొంతసేపు  మరిపించి  మురిపించగలదేదైనా  ఒక  కళే , సమాజ  పురోభివృద్దికి  కళావికాసం  ఎంతో  ముఖ్యం.

ప్రః కళాకారిణిగా  సమాజానికి  మీరెంతవరకు  తోడ్పడుతున్నారు?

జః కళా ప్రపంచంలో  సినిమా  ఒక  చిన్నభాగంమేగా,  అందుకే  నా  చేతనైన  సేవ చేస్తూ మీవంటి  అబిమానులనానందింప  చేస్తున్నాను..

ప్రః మీవంటి  నటీమణులంతా  ఏకమై  తెరపై  సెక్స్ కు  వ్యతిరేకించి  దర్శక  నిర్మాతలకు  నిర్మొహమాటంగా  చెబితే  వాళ్లు  కళ్ళు  తెరుస్తారనుకుంటా. మీరాపని  ఎందుకు  చేయకూడదు?

జః అక్కడే  పొరబడుతున్నారు మీరు.   అంతా ఏకమై  నిర్మొహమాటంగా  చెప్పవలసింది మేము  కాదు,  మీరు.  మీరు  ఏది  కోరితే  అది  చేయడమే చిత్ర  నిర్మాణంలో  జరుగుతోంది  గదా.

ఎస్. మరళి   మచులీపట్నం.

ప్రః  ఒదినా - మరిది, ఈ ఇద్దరి  అనురాగమోలా  వుండాలి?

జః అక్కా తమ్ముడుగా , తల్లీ  కొడుకుగా.....

కుమ్మల  శివరామకృష్ణారావు.  కొడాలి.

ప్రః మీకు  అరవ  నటులతో  నటించినపుడు  హాయిగా  వుంటుందా  లేక  తెలుగువారితో  నటించినపుడు  హాయిగా  వుంటుందా?

జః నటనకు భాషా భేధాలుంటాయనుకోటం  శుద్ధ  పొరపాటు.  మేం  నటించిన  చిత్రాన్ని  చూచి  మీరు  మెచ్చుకుంటేనే  మాకు  హాయి  అనిపిస్తుంది.

గుడ్ల  శ్రీరామమూర్తి.  రాయగడ.

ప్రః నేనొక   హీరోయిన్ ను  ప్రేమించి  పెళ్ళి  చేసుకోవాలని  వుంది.  మీ  సలహా  యేమిటి?

జః మద్రాస్  లో  మారేజి  సీజన్   అయిపోయింది....మరెక్కడైనా  ట్రై చేయి తమ్ముడూ.

కె. గిరిజాకుమారి . నరసరావుపేట.

ప్రః భారతనారి పై అభిప్రాయం  ఏమిటి?

జః ఆ నారీలపై  అభిప్రాయాన్ని  తెలిపితే  నేటి  నారీలోకం ఆ పై  నాడి  సంధిస్తారు......

మావూరు  కాళిదాసు , పాత  శ్రీకాకుళం.

ప్రః  మీరు  దర్శకత్వం వహిస్తున్న  చిత్రం  ఎంతవరకు  వచ్చింది?

జః పేపరు  వర్కు  పూర్తయింది . విజయ  దశమికి  సెట్స్  మీదకు  వెళ్తోంది.

పత్తి అదృష్టదీపన్.

ప్రః  మనదేశంలో  చిత్ర పరిశ్రమను  జాతీయం  చేస్తే  ఎల్లాగుంటుంది?

జః దానివలన  స్వేచ్ఛ  పోతుందని కొందరి  అభిప్రాయం.

ప్రః సినిమాల్లో  నటించాలనే  వెర్రి  ఆవేశంతో  మద్రాస్  వచ్చి,  అక్కడ  నానా  అగచాట్లు  పడుతున్న  యువతీ  యువకులకు  మీరిచ్చే  సందేశమేమిటి?

జః చెడి  చెన్నపట్నం  చేరుకునేది  పూర్వపు  సామెత.చెన్నపట్నం  చేరి  చెడిపోతున్న వాళ్లు  యిప్పుడు.  వీరంతా ఏ అధారం ,ఆసరా  పూర్తిగా  లేకుండా ,కేవలం  పగటి  కలలు  కంటూ  యిక్కడికి వచ్చి  ఇలా అగచాట్లు   పడడం సమంజసం  కాదు.

ఆర్. జె. రాజు  బాపట్ల.

ప్రః మీ దర్శకత్వంలో  ఒక  చిత్రం  తయారవుతోందటగదా . అది  విజయం కాగానే  మీరు  చిత్రాలలో  నటించడం  మానేసి  దర్శకురాలిగా  స్థిరపడటం  చాలా  సమంజసంగా  వుంటుంది.  ఏమంటారు?

జః  కాలాన్ని బట్టి  నిర్ణయాలుంటాయి.

ప్రః మీ  అభిమాన  శ్రోతలకు  మళ్ళీ  మీ  పాట వినే   అదృషం  ఎప్పుడు?

జః ఆ అవకాశం   నాకు  లభించినప్పుడు.

పి. సౌజన్య  విప్పన్నపేట.

ప్రః తిరుపతిలో  సంభవించిన   ప్రమాదానికి  మీ  దృష్టిలో  దోషులెవరు?

జః ఎవరిదీ  దోషం  అనేందుకు  వీలులేదు . అంతా విధి.

ప్రః మీ  దర్శకత్వంలో  తయారౌతున్న  చిత్రం  పేరేమిటి?

జః చిన్నారి మనసులు.

ప్రః మీరు  ఏదైనా  ఒక  నవల  వ్రాయకూడదా?

జః నవల నా వల్ల కాదు,ఇప్పట్లో...

ఎన్ .వి. ఆర్  జోగారావు  అనకపల్లి.

ప్రః నేటి  సమాజంపై  సినిమాల  ప్రభావం  ఏమిటి?

జః నేటి  సినిమాలు  ఈనాటి సమాజానికి  దర్పణాలు.

ప్రః పత్రికా రంగానికి   చలనచిత్ర రంగానికీ  గల  సంబంధం  ఎట్లాంటిది?

జః ప్రతి  రంగానికి  పత్రికా రంగంతో  వున్న  సంబంధం  లాంటిదే.

ప్రః  జకార్తా  పర్యటన  మీకు   నేర్పిన  అనుభవం ఏమిటి?

జః అక్కడ  మనం  నేర్చుకోవలసిందేమీ  కనిపించలేదు . మనం  నేర్పించి రావాలి.

ప్రః శృంగారరస  ప్రధాన  చిత్రములు  జయం పొందినంతగా  ఇతర  చిత్రాలు  జయం  పొందడం  లేదు.

జః అభిరుచులు  మారటమే.

 

రావుల  సరోజ ,   విజయవాడ.

ప్రః మీరు  సీనీ  జీవితంలో  ప్రవేశంచి  ఎన్ని  సంవత్సరాలయింది?

జః మే 17వ  తేది, 1950  సంవత్సరంలో.

ప్రః ఆ కళామతల్లి  నేర్పిన  పాఠాలేమిటి?

జః ఆ శిక్షణ  ఈనాటి  కళ కు  పనికిరావటం  లేదు .( దానికి  నా లావు  అడ్డు  అనుకో  కండేం.)

ప్రః సినిమా  అంటే  ఏమిటో నిర్వచించండి?

జః  లలిత  కళల సమగ్ర   సంగమం  సినిమా.

ఎం . శేశగిరిరావు .

ప్రః ఇంటిదగ్గర  ఎంతో  సుఖ  సంతోషాలతో ేవుంటూ  చిత్రాల్లో విషాద పాత్రలంత  గొప్పగా  ఎల్లా  నటిస్తారండి?

జః ఆ రోజుల్లో క్రమశిక్షణతో  మేం  నేర్చుకున్న  విద్యాఫలితం.

విథాభారిత  కృష్ణమూర్తి , పెద్ద  కన్నలి.                               

ప్రః స్త్రీ  కోరేదేమిటి?

జః ఏ ఒడుదుడుకులు  లేకుండా  తన  సంసారం  సాగిపోవాలని...

ప్రః స్త్రీని   సంతృప్తిపరచేదేమిటి?

జః తనను అర్థం చేసుకున్న  అనుకూలమైన  భర్త దొరకడం.

ప్రః స్త్రీ కి వుండవలసిన  దేమిటి?

జః అణుకువ , మెలకువ , వినయం ,విధేయత.

యన్ .శ్రీశైలం.  హైదరాబాద్.

ప్రః ఈ మధ్య మీరు  సినిమాలలో  కనిపించడం  లేదేం  తరచుగా?

జః సన్నపడ్డాక  కనిపిద్దామని.

పి,బి,టి యస్. సుందరి, హైదరాబాద్.

ప్రః  మీ హెయిర్ స్టయిల్  చూసి నేనూ  అలా వుండాలనుకున్నా.  అమ్మలక్కలు మరి  ఊరు కోవడం లేదు . ఏమిటి  సాధనం?

జః  ముఖాన్ని  బట్టి  శిరోజాలంకరణ... మీకేది  నప్పుతుందో  మరి.

డి . సీతారామలక్ష్మి . కావలి.

ప్రః మీకు    పువ్వులంటే  ఇష్టం ?

జః   మల్లెపువ్వులు.

ప్రః  మీరు  మీ భర్తను  పేరుతో  పిలుస్తారా?

జః ఊహూ....

శీది  రామాస్వామి . భువనేశ్వర్.

ప్రః మధ్యపాన  నిషేధాన్ని  తొలిగిస్తే  అన్ని  సమస్యలు  సగం  తీరిపోతాయా?

జః అంతా  ప్రభుత్వం చేతుల్లో  వుంది.

ముమ్మెన  హనుమంతురావు , నర్సీపట్నం.

ప్రః  తెలుగుచిత్రాల్లో  తరచు  కనిపిస్తూ,  మీరీ  మధ్య  మీ  అభిమానులకు  ఆశాభంగం  కలిగిస్తున్నారు  కారణం?

జః సర్లెండి , తరచుగా  కనిపించడం  లేందే?

ఎం , వి చూదరి  సెద్దవూం.

ప్రః  ప్రస్తుతం  మీరు  నటిస్తున్న  చిత్రాలు  ఏమిటి?

జః ఆజామ్  ఆర్ట్సవారి  తెలుగు  చిత్రం, భక్త  విజయ తిరుమాళ  సేవై  అనే  రెండు  ఈస్ట్ మన్  కలర్  తమిళ చిత్రాలు , నా స్వంత  చిత్రం  మూగమనసులు  (తమిళం).