◄
‘ఈనాడు’ ఆదివారం 7 అక్టోబరు 2007 నటి గీతాంజలి కబుర్లు.
“బలరామశ్రీకృష్ణ” అని మరో హిందీ సినిమా… అందులో సావిత్రిగారు బలరాముడి భార్య రేవతిగానూ నేను శ్రీకృష్ణుడి భార్య రుక్మిణిగానూ నటించాం. ధారాసింగ్, సాహు మొడక్ లు బలరామాకృష్ణులుగా నటించిన ఆ సినిమా వందరోజులు ఆడింది.
ఆ సినిమా షుటింగ్ సమయంలోనే సావిత్రిగారూ నేనూ చాలా రోజులు బొంబాయిలో ఉన్నాం .ఆవిడ ఎప్పుడూ సరదాగా ఉండేవారు. ఆమెకు మంచి భోజనం అంటే ఇష్టం. దాంతో అక్కడవాళ్లు పెట్టే చపాతీలూ, పప్పూ తినలేకపోయేవారు. “ ఛీ...ఛీ...ఈ గడ్డి ఇంకా ఎన్నొ రోజులు తినాలి...హాయిగా కడుపునిండా తిని పనిచేసుకునేవాళ్లం చచ్చినా మరోసారి ఈ హిందీ సినిమాలు ఒప్పుకోకూడదు” అనేవారు. చివరకు ఓ రోజు జెమినీగణేశన్ గారు రెండు క్యారియర్ లు పట్టుకుని విమానం దిగారు , చేపలకూర , కోడికూర, బిర్యానీలు అన్నీ తీసుకుని. అందరం ఆవురావురుమంటూ తిన్నాం . మానాన్నగార్ని “ శ్రీరామమూర్తి గారూ మొహమాటపడకుండా లాగించేయండి....... మళ్ళీ ఎప్పుడు తింటామో” అనేవారు సావిత్రి.
‘ఈనాడు’ ఆదివారం 14 అక్టోబరు 2007 నటుడు బాలయ్య కబుర్లు.
“చెల్లెలి కాపురం” సినిమా కోసం వాహిని స్టూడియోలో సెట్ వేశాం. నా సినిమాకు క్లాప్ కొట్టాలని మహానటి సావిత్రిని అడిగితే సరేనన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ముహూర్తం. రాత్రే కుర్చీలూ అవీ వేశాం. నేను ఉదయం 7.45 గంటలకు అక్కడికి వెళ్తే అప్పటికే సావిత్రిగారు వచ్చి ఒక్కరే ఓ కుర్చీలో కూర్చుని ఉన్నారు. అదేమిటంటే....
వేరే ఏదో షూటింగ్ కు మేకప్ వేసుకొని బయల్దేరి మధ్యలో మా సినిమా క్లాప్ కొట్టి వెళ్దామని ఆగానన్నారు. మాటిచ్చాక తప్పని అంకిత భావానికి ప్రతీక ఆ సంఘటన.