కిన్నెర ఆర్ట్ ధియేటర్స్,  హైదరాబాదు, వారిచే 1979లో, మహానటి సావిత్రి సన్మాన సభ సంధర్భంగా ఏర్పాటు చేసిన వ్యాసరచన పోటీలో రెండు ఉత్తమ వ్యాసాలు.

 

                              నటనకు నిర్వచనం – మహానటి సావిత్రి
                          రచన:       శ్రీ దేశిరాజు లక్ష్మీనరశింహారావు
                       ( వ్యాసరచన పోటీలో ప్రధమ బహుమతి పొందినది)
షుమారు పాతికేళ్ళ క్రితం, ‘పాతళభైరవి’ చిత్రంలో నృత్యం చేస్తూ, కొద్దిసేపు మాత్రమే కనిపించి, తళుక్కుమని వెండి తెరపై  మెరిసిందో  అందమైన అమ్మాయి. ‘సంసారం’ చిత్రం ద్వారా  ప్రధమంగా ఆంధ్ర ప్రేక్షకులకు పరిచమైంది.
        తెలుగులో చలనచిత్రాలు అప్పుడప్పుడే ఎక్కువగా రూపొందుతున్న తరుణంలో, తమకున్న నాటకానుభవంతో, సినిమాల్లో ప్రవేశించి, నటనకు నూతన భాష్యం చెప్పుకొంటూ, ఎంతటి క్లిష్టమైన పాత్రనైనా, కష్టమనుకోకుండా, కడు నైపుణ్యంతో, దక్షతతో వేస్తూ, అఖిలాంద్ర ప్రేక్షకుల అభిమానాన్ని ఆనాడు అపారంగా, అమితంగా, అనంతంగా చూర గొన్న సావిత్రిగారు మన తెలుగు చలన చిత్ర కళామతల్లికి ముద్దుబిడ్డ, మొన్న మొన్నటి వరకు అనగా 1975 వరకు తెలుగు చలన చిత్ర సామ్రాజ్యానికి ‘మకుటంలేని మహారాణి’ లా వెలుగొందినదీమె. తెలుగు – చలన చిత్రహారంలో ఆమె నటించిన ప్రతి చిత్రం ఒక్కొక్క ఆణిముత్యం.
        ఆమె నటించిన చిత్రాలను అందులో ఆమె ధరించిన పాత్రలను ఎన్నటికీ మరిచి పోలేనంతగా, ఉత్తమంగా నటించి ‘నటన’ అనే పదానికి , అన్యులెవరికీ సాధ్యం కానట్లుగా, నూతన నిర్వచనాన్ని ప్రవరించిన ప్రఖ్యాతి, తారామణులలో ఒక్క సావిత్రిగారికే దక్కింది. ఆమె ధరించిన ప్రతి పాత్రలోన విభిన్నత – ప్రత్యకత – వైవిద్యం ఉండటమే అందుకు కారణం.
        అన్ని చిత్రాలలో ఆమె ధరించిన పాత్రలు వేరు. ‘దేవదాసు’ చిత్రంలోని ‘పార్వతి’ పాత్ర వేరు. శరత్ చంద్రుని నవలలోని పార్వతి పాత్రను పూర్తిగా అర్థంచేసుకుని, తన వినూత్న హావ భావ ప్రదర్శనతోను, హద్దులు మీరక సంభాషణలు ఒక పద్దతిలో చెప్పటంతోను,  సన్నివేశాలకు తగినట్లుగా సమర్దవంతంగా నటిస్తూ, అత్యంత దీక్షతో పార్వతి  పాత్రకు మిక్కలి న్యాయం చేకూర్చి, ప్రేక్షకుల కంటతడి పెట్టించిన, ఆ చిత్రమే ఆమె చలనచిత్ర జీవితంలో ఓ మరువనీయని మలుపు రాయి అయినదనటంలో ఎంత మాత్రం అసత్యం లేదు.
“రక్తసంబంధం”  చిత్రంలో అన్నయ్య ఆత్మీయతను , అనురాగాన్ని  అన్నా – చెల్లెళ్ళ రక్తసంబంధాన్ని  విడలేని చెల్లెలుగా  అద్భుతంగా  నటించిన , తాను గొప్ప నటినని, చెప్పకనే   చెప్పారు.       
‘ఆరాధన’ చిత్రంలో ముందు తప్పుచేసి, తర్వాత యుక్తాయుక్తాలు గ్రహించి, పశ్చతాపపడి, కనుచూపు కోల్పోయిన ప్రియునికి సేవలు చేసి, కడకు దక్కించుకొన్న పాత్రలో ఆమె నటన ఎంతో శ్లాఘనీయంగా ఉంది.
        పి. పుల్లయ్యగారి ‘అర్ధాంగి’ చిత్రంలో పిచ్చివాడు, మతిస్థిమితంలేని భర్తలో  క్రమేణా మార్పులు తెచ్చి, సంసారాన్ని – ఇంటి పరుపు ప్రతిష్ఠలను నిలబెట్టుకునే పాత్రలో ఆమె ఎంతో చాకచక్యంగా పోషించారు. “కోడలు దిద్దిన కాపురం” చిత్రంలో కూడ ఆమె పాత్ర అలాంటిదే. అందులో “ నీ సంఘం; నీధర్మం, నీ దేశంను మరవద్దు” అన్న పాట వద్ద ఆమె నటన అనితర సాధ్యమైనట్టిది.
        “రారోయి మా ఇంటికి, మావో మాటున్నది, మంచి మాటున్నది”  అనే పాటకు  “దొంగరాముడు” చిత్రంలో, ఆ పాటకు తగినట్లుగా ఆమె చూపిన అభినయానికి, అన్ని విధాలా సరిపోయేలా చేసిన నృత్యానికి ప్రేక్షకులు ఈలలు వేస్తూ, చప్పట్లు కొట్టటానికి కారణం ఆ చిత్రంలో ఆమె నటన సూపర్బ్ గా  ఉండటమే.
        “నాదీ ఆడజన్మే”  చిత్రంలో చదువురాని భార్యగా, భర్త ఆదరణకు – అనురాగానికి దూరమై అష్టకష్టాలననుభవించే పాత్రలో ఆమె లీనమైనదిగా అనిపించేలా నటించారు.
        “ ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి” అని నిజంగానే తోచేలాగా, దేవత చిత్రంలోని ఇల్లాలుగా, గృహాధర్మాలు సర్వం తెలిసిన గృహిణి వంటి దేవతగా ఆమె నటన ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఆ చిత్రంలో ఆమె ద్విపాత్రభినయం చేసి రసజ్ఞులను మైమరపించారు.
        ప్రేమ, ఎడబాటు, బాధ, విరహం,  విచారం, మంచిమనసు, దుఃఖం, జాలిగుండె, ఇలాంటివి కలబోసి ఎన్నిరకాలు పాత్రలు
రూపొందించినా, వానిని బాగా, పర్ఫెక్టుగా స్టడీ చేసి, ఏ విధంగాను, ఆయా పాత్రలకి న్యాయం చేయని విధంగా దీక్షా-దక్షతతో, తమే     శక్తి సామర్ధ్యాలను పూర్తిగా సద్వినియోగం చేసుకొని నటించే వారనటానికి, ‘మూగమనసులు’ ‘సుమంగళి’, ‘మంచిమనసులు,’ ‘వెలుగునీడలు’,‘మాతృదేవత’, ‘కుంకుమరేఖ’ ఇత్యాది చిత్రాలు అమె నటనా చాతుర్యాన్ని ఋజువుచేస్తూ, బహు జనాదరణ పొందటమే కారణం.
        “ఓహో బస్తీ దొరసాని , బాగా ముస్తాబయ్యింది, అంచందాలన్నీ తానే తీసుకువచ్చిందా” ప్రేక్షక జనాన్ని ఆనంద డోలికల్లో ముంచెత్తి, ఆ చిత్ర విజయానికి కారణ భూతమైంది.
        ‘నా కంటి పాపలో నిదురపోరా’ అంటూ “వాగ్దానం” చిత్రంలో ఆమె నటన ప్రేక్షకుల కంటిపాపలో, హృదయంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. “కుటుంబ గౌరవం”, “వదిన”, “నమ్మినబంటు”, తుదకు “మిస్సమ్మ”, “గుండమ్మకధ”, “ఇంటిగుట్టు”, “అప్పుచేసి  పప్పుకూడు” వంటి హాస్య చిత్రాల్లో సైతం ఆమె హాస్యపాత్రలు ధరించి, ప్రేక్షకుల మెదడులో ఆయా చిత్రాలు కలకాలం నిలిచిపోయేలా ఘనంగా నటించారు. ఈ చిత్రాల్లోని హాస్య ఘట్టాలు ఇప్పటీకీ కళ్ళల్లో మెదల్తూ ఉంటాయి.
        ‘మనుష్యులు - మమతలు’ చిత్రంలోని ఆమెపాత్ర మానసిక సంఘర్షణతోను, ఎంతో భాధా, వ్యదలతో కూడినట్టిది. ఆ పాత్రను ఆమె చాలా ఆసక్తికరంగా నటించి రక్తి కట్టించారు.
        “కార్తవరాయనికథ”, “కంచుకోట”, “ప్రతిజ్ఞ” లాంటి శతదినోత్సవ జానపద చిత్రాల్లో సైతం ఆమె ఎంతో ఉత్సాహంగా నటించి, సకలాంద్రావళిచే, ఉత్తమ నటిగా, గుర్తింపబడినారు.
          “శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం”, “మాయాబజారు”, “పాండవ వనవాసం”, వంటి పౌరాణిక చిత్రాల్లో కూడా నటించి, రసజ్ఞులను మెప్పించి “శభాష్ సావిత్రి” అనిపించుకొన్నారు.
        “బ్రతుకు తెరువు”, “కన్యాశుల్కం”, “భలే అమ్మాయిలు”, “తల్లిదండ్రులు” వంటి చిత్రాలు ఆమె నటనకు దర్పణం పట్టాయి.
        “కవిత” చిత్రంలో సమాజంచే వెలివేయబడిన వేశ్యగా, కూతురి మానాన్ని హరించిన దుష్టుని అంతం చూసిన స్త్రీ శక్తిగా ఆమె నటన పతాకస్థాయికి చేరుకుంది.
        మళయాళ చిత్రం ‘చుళి’ లో ఆమె నటన కేరళీయులను అమితంగా ఆకట్టుకొని, ఆ చిత్ర శతదినోత్సవానికి కారణమైంది.
        ఆమె నటనా సామార్ధ్యాన్నే కాకుండా చిత్ర నిర్మాణంలో వివిధ శాఖలు పరిశీలిస్తూ పరిశోదిస్తూ ‘చిన్నారిపాపలు’, ‘వింతసంసారం’, ‘మాతృదేవత’ చిత్రాలకు దర్శకత్వం వహించారు  కూడా. ‘మాతృదేవత’ చిత్రం దాదాపు 5, 6 కేంద్రాల్లో శతదినోత్సవాలు జరుపుకుంది కూడాను.
                సావిత్రిగారు తెలుగు-తమిళ-మళయాళ భాషలలో నటించి ‘త్రి భాషా నటి’ అనిపించుకున్నారు. నటన, చిత్రనిర్మాణం, దర్శకత్వ శాఖలను చేపట్టి, ‘ బహుముఖ ప్రజ్ఞా శాలిని’ అని, “నటి శిరోమణి” అని, బిరుదులు పొంది ఎన్నో సభలలో సత్కారాలు – సన్మానాలు అందుకొని, పండిత-పామర జనంచే వేనోళ్ళ కొనియాడబడినారు.
        అందుకే “నటనకు నిర్వచనం -మహానటి సావిత్రి” అనటం ఎంతో సముచితం.
                             

----------------------------------------------------------------------------

                                  
నటనకు నిర్వచనం  మహానటి సావిత్రి
 రచన :శ్రీ జూర్జి రాజు         
(వ్యాసరచన పోటిలో ద్వితీయ బహుమతి పొందింది)

        నటన అనేది ఒక అద్బుతమైన కళ. నటన, నాట్యం, సంగీతం మొదలగునవి మనస్సును ఆనందపరచే కళలు. నటనలో ఎన్నో పాత్రలను చూస్తూ వుంటాము. పడుచువాళ్ళు ముసలి వారిగను, ముసలివారు యవ్వనస్థులుగాను, నటిస్తూవుంటారు.పౌరాణికంలో ఇంద్రుడు, రాముడు, కృష్ణుడు మొదలగు వేషాలను మనం చూస్తూ వుంటాము. వారిని చూసినంతసేపూ అప్పుడు వారు అలా వుండేవారేమో ననిపిస్తూంది.
        కొంతమంది ఆపాత్రలకు జీవంపోస్తారు. అందులో వారు ఐక్యమై పోతారు. ఒక కథగా అల్లుతారు. కేవలం ఒకే నటుడుగాని, నటిగాని ఎన్నో వేషాలువేసి సినీ జీవితానికి అంకితమైపోతారు.
        అటువంటి పాత్రలు పోషించడంలో సావిత్రి దిట్ట, నటించడంలో ఆమెది పైచేయి. ఆమె ప్రియురాలిగా, భార్యగా, దేవకన్యగా, సత్యభామగా, శశిరేఖగా యువరాణిగా అనేక పాత్రలు పోషించి తెలుగు చిత్రసీమలో అగ్రనటిగా మకుటంలేని మహారాణిగా, మన ఆంధ్రుల ఏకైక అభిమాన నటిగా ముందంజవేసిన సావిత్రి నిజంగా నటనకు నిర్వచనం.
        సావిత్రి ఒక మహానటి. ఆమె పుట్టిన తర్వాత నటన పుట్టిందనుకోవచ్చు. ఆమె నటశిరోమణీ, సాటిలేని మేటినటి, గగనవీథిలో మెరిసే ఒక మహోజ్వల తార. ఆమె ముఖారవిందము చంద్రునితో పోటీచేయునటువంటిది.
        ఆమె కళ్ళల్లో కాంతివుంది, జీవంవుంది. దీనత్వంవుంది, చిలిపితనంవుంది, మనస్సులను కరిగించే కరుణ రసం వుంది. ఆమె పెదవులు చిరునవ్వులొలికించే వెన్నెల సోనలు, సావిత్రి నటనా కౌశల్యమంతా ఆమె పెదవులలోనే వుంది. ఆమె పెదవుల చిరునవ్వులే వెండి తెరకు అలంకారం.
        ఆమె స్వరంలో మాధుర్యం వుంది. రౌద్రంవుంది. ఆమె నందనవనంలోని సుందర పుష్పం వంటిది. ఆమె గౌరవనికూడా, ‘నవరాత్రి’ చిత్రములో ‘నవరాత్రి ,శుభరాత్రి,’ పాట ఆ సినిమాకు ఒక నిండుదనం తెచ్చింది.
        ఆమె మొదటి చిత్రం “ పాతాళభైరవి” తో వెండితెర నలంకరించి, చిత్రసీమలో ఆమెతో పోటీచేయువారు ఎవరూ లేరనిపించుకుంది, “దేవదాసు”లోని పార్వతి పాత్ర ఆమెకు కీర్తి తెచ్చింది. ఆమెకు ఆమెకు ఆమెయే సాటి, “చంద్రహారం ”లోని ఆమె విలన్ పాత్ర – అసూయతో చేసిన చేష్టలు బహు ప్రశంసనీయమైనవి.
        “చివరకు మిగిలేది” సినిమాలోని ఆమె డాక్టరు పాత్ర మరుపురానిది. ప్రేమించిన వ్యక్తిని పొందలేక పిచ్చివాళ్లను బాగుచేసే డాక్టరే చివరకు పిచ్చిదై పోతుంది. ఈ సన్నివేశంలో సావిత్రి నటన మహా అద్భుతమైంది. ఆ పాత్రలో ఆమె రాణించింది. జీవించింది. యీ చిత్రం రాష్ట్రపతి బహుమతి పొందింది.
        “మాయా బజార్” లోని మాయ ఘటోత్కజునిపాత్ర బహు చక్కగా వుంది. అందులో ఆమె చేసిన చిలిపి చేష్టలు మరుపురానివి. “అర్ధాంగి”, “నమ్మినబంటు”. “రావోయి మా యింటికి మామా మాటున్నది.మంచి మాటున్నది”. ఆర్. నాగేశ్వర్రావుతో నటన చాల బాగుంది. “కార్తవరాయుని కథ”, “కంచుకోట”, “వేంకటేశ్వర మహాత్మ్యం”,  లోని ఆమె ప్రాతలు అందలాన్ని ఎక్కించాయ్.
        “రక్తంబంధం” లోని ఆమె పాత్ర బహు జాలిగలది. యన్.టి. రామారావు గారికి చెల్లెలుగా అంతబాగా ఎవరూ నటించి వుండరేమో! “మా బాబు”, “ మనసే మందిరం” లోని ఆమె నటన బహు దయనీయమైంది. అటువంటి పాత్రలు పోషించడం సావిత్రకి ఉగ్గుతోపోసిన విద్య. “ఆరాధన”, “వెలుగు నీడలు”, “చదువుకున్న అమ్మాయిలు” చిత్రములలోని ఆమె నటన గణనీయమైంది. ఆంధ్రుల ఏకైక అభిమాన నటి అయ్యింది.
        “నర్తనశాల”, “పాండవ వనవాసము” చిత్రాల్లోని ద్రౌపది పాత్ర బహు ప్రశంస నీయమైంది. కీచకుని వధించే నెపంతో “దరికిరాబోకు రాజా” అను పాటకు ఆమె నటన చిత్రానికి గీటురాయి. ఆపాత్రలో ఆమె రాణించింది. జీవించింది.
        “నాదీ ఆడజన్మే” లోని నల్ల పిల్లగా ఆమెపడిన బాధలోని నటనాచాతుర్యం అభిమానుల హృదయాలను ద్రవింపజేసింది. “మంచి మనసులు”లోని ఆమె లాయరు పాత్ర మరుపురానిది. కోర్టులో ఆమె వాదించిన తీరు అభిమానుల నుద్రేక పరచింది. అప్పటితో సావిత్రి ఉపరాగ్ర శిఖరాగ్రములందుకొంది. తెలుగుసినీ నటిమణులలో అత్యుత్తమ నాయికగా ఎన్నుకోబడింది.
        “మూగ మనుసులు” లోని ఆమె నటన బహుజాలి గొల్పింది. ఆమెకు ఆమెయే సాటి. “సుమంగళి” చిత్రంలోని నటన, చిలిపితనం బహు చక్కగా వుంది. ‘వలపువలే తీయగా వచ్చినావు నిండుగా’ ,అన్నపాటకు అక్కినేని కౌగిలిలో కరగిపోవడం, బెదురుచూపులు ఆ చిత్రానికి గీటురాయి. “డాక్టర్ చక్రవర్తి” లోని సావిత్రి నటన బహుముద్దుగా వుంది.      ఇటు జగ్గయ్య, అటు నాగేశ్వరరావు మధ్య సావిత్రి నటనలు అద్భుతంగా వుండేవి. వీరి కాంబినేషన్తో చలనచిత్రసీమ మంచి అభివృద్ధిపొందింది. ముందంజ వేసింది. సావిత్రి చిత్రసీమలో మకుటంలేని మహారాణి వంటిది. వెండితెరకు ఒక జ్యోతి వంటిది. సావిత్రి నటీమణులకు మార్గదర్శి, నేటి అగ్రనటి వాణిశ్రీ ఆమె అడుగుజాడల్లో నడుస్తున్న సంగతి అభిమానులకు తెలసిన విషయమే.
        సహనానికి సావిత్రి నటన మారు పేరు. కవ్వించడం, నవ్వించడం, ఏడిపించడం. సావిత్రి కళ్ళల్లో చోటుచేసుకున్నాయి. ఆమె కీర్తి సెలయేటి ధారలాంటిది. ఆమె నటనా జీవితం సువాసనలు వెదజల్లే పూలబాట వంటిది. ఆమె భరతమాత ముద్దుబిడ్డ, కళామతల్లి అనుంగు పుత్రిక, అందుకే ఆమె నటనకు నిర్వచనం అయింది.