ప్రచురితమైన రచనలు.

1979లో కిన్నెర ఆర్ట్ ధీయటర్స్ వారి సన్మానం సందర్భంగా
ప్రముఖుల సందేశాలు

ప్రపంచ ప్రఖ్యాతిగొన్న ఎలిజబెత్ టైలర్, మీనాకుమారి కోవలో చెందిన మన సావిత్రిగారు ఆంధ్ర నటీమణి కావడం అందరీకి గర్వకారణం.

పద్మనాభం.

శ్రీమతి సావిత్రి హృదయం కళాసరస్వతికి ఒక గుడి, ఆమె నటజీవితం యీ తరం నటీనటులు జీవిత పాఠాలు నేర్చుకోగల బడి.

అల్లు రామలింగయ్య.

ఆమె సర్వతోముఖంగా ప్రజ్ఞా ప్రాభవాలుగల వ్యక్తి!…….. ఒక కళాత్మకమైనశక్తి.

రంగనాధ్.

చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రికి నా ఆశీస్సులు. బిడ్డను పలువురు పొగిడితే విని అనందించవలసిందే కాని తల్లి తన బిడ్డ గొప్పతనాన్ని చాటుకోకూడదు. సావిత్రి నా పెద్దకూతురు. గారాలబిడ్డ. అందుకే ఏపుగా ముద్దుగా పెరిగింది. శారీరకంగానే కాకుండా మంచినీ, మన్నననూ పేరు ప్రతిష్టలనూ ఏపుగా పెంచుకుంది. మాసం మారిందంటే యిటు తెలుగులోను, అటు అరవంలోను ప్రముఖ హీరోలతో సావిత్రి నటించిన సినిమాలు విడుదలయ్యేవి! విజయవంతమైయ్యేవిః

శాంతకుమారి.

నా సోదరి శ్రీమతి సావిత్రి ‘మహానటి’ అన్న సత్యం “జగమెరిగిన బ్రాహ్మణునికి జంథ్యమేల” అన్నట్లే వుంటోంది. నేను నా సోదరి “సావిత్రి” గురించి చెప్పాలంటే ఎంతయినా వుందిః అంతులేనంత వుంది.

అంజలీదేవి.

“గమనించు గమ్యాన్ని, గుర్తించు కర్తవ్యాన్ని,

తలచుకో నీగతాన్ని, మలుచుకో మళ్ళీ నీ కళా జీవితాన్ని,

కలిగించు మా అందరికీ ఆనందాన్ని,
s
అర్ధించు కళామతల్లిని నీ కథ కావ్య రూపం కావాలని”

జి. వరలక్ష్మి.

నాటికీ నేటికీ ఆంధ్రప్రేక్షకుల మనసులలో చెరగని ముద్రవేసిన ఎన్నో కమనీయ పాత్రలకు జీవం పోసిన ఒక మహానటీ :

ఉత్తమ కధా చిత్రాలకు రూపకల్పన చేసిన ఆదర్శ దర్శకురాలు :

యావాదాంధ్రలోకం యొక్క ఆత్మీయతను పంచుకున్న ఆంధ్రుల అభిమాన ఆడపడుచు : చలన చిత్ర రంగానికి గర్వకారణం : అన్నిటికీ మించి మనసున్న ఒక అపురూప వ్యక్తిత్వం :

ఇన్ని ముత్యాలు పొదగబడ్డ లలిత కళా శిల్పి శ్రీమతి సావిత్రి :

దాసరి నారాయణరావు.

మొలకగా, మొక్కగా, మహావృక్షంగా పెరిగి మఱ్ఱిచెట్టులా వ్యాపించింది ఎందరెందరో ఆ నీడన తారలయ్యారు.

ఏడిది గోపాలరావు.

1953లో డి. యల్. నిర్మించిన వినోదావారి “దేవదాసు” ప్రీవ్యూచూచిన పరిశ్రమలో మహామహులందరూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకమహానటి ఉద్భవించిదని ఆనాడే అనుకోవడం నాకు తెలుసు.

మిక్కిలినేని రాధకృష్ణమూర్తి.

ఆమె ప్రదర్శించిన హావభావాలు సెల్యూలాయిడ్ పైన, ప్రేక్షకుల హృదయాల లోను శాశ్వతంగా చెరగని ముద్రవేసినది. ఆ కోవకు చెందిన చిత్రాలన్నింటిని గవర్నమెంటు లైబ్రరీలో భద్రపరిస్తే బాగుండును. గవర్నమెంటువారి అధ్వర్యంలో నడుస్తున్న ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో ఏక్టింగ్ డిపార్టుమెంటులో ప్రొఫెసర్ గా నియమించి ఆమె నటనా ప్రావీణ్యతను ఎమెచ్యుర్సుకు ఉపయోగించాలని ఆశిస్తాను.

రామినీడు.

కొందరు మహామహులు కొన్ని ఘనకార్యాలు సాధించటానికే పుడ్తుంటారు. వారినే కారణజన్ములు అంటారు. నా అభిప్రాయంలో శ్రీమతి సావిత్రి కూడ కారణ జన్మురాలే అంటాను.

పెండ్యాల నాగేశ్వరరావు.

శ్రీమతి సావిత్రి నా “ఎం. ఎల్. ఎ” చిత్రంలో కథానాయకిగా నటించారు. అనాటికే వికసించిన ఆమె ప్రతిభ క్రమక్రమంగా మరింత వికాసంచెంది, భారతమంతా గర్వించదగిన మహానటిగా ఆమెను నిలబెట్టింది. ఆమె అగ్రశ్రేణి నటిగా కలకాలం కీర్తి శిఖరాల నధిరోహించడానికి, ఆమెలోని కళాసంపద శ్రద్దాసక్తులు, పాత్రవగాహన, క్రమశిక్షణ ముఖ్యకారణాలు, నేటి యువతరం కళాకారులకు ఆ లక్షణాలు మార్గదర్శకం కావాలని నా ఆకాంక్ష.

కె.బి.తిలక్

కొంతమంది సినిమా నటీమణులు రూపురేఖల్లో చాలా అందంగా వుంటారు. కాని వాళ్ళ ముఖాలలో అయస్కాంతశక్తితో కూడుకున్న “వర్చస్సు” వుండదు. ఆ ‘పర్చన్సు’ నే ఆంగ్లంలో ‘గ్రేస్’ అంటారు. ఈ ‘గ్రేస్’ పుష్కలంగా తమ ముఖాలలో తొణికిసలాడే తెలుగు సినిమా నటీ నటులలో శ్రీమతి సావిత్రికి అగ్రతాంబూలం నిరభ్యంతరంగా ముట్ట జెప్పవచ్చు.

ఇంటూరి వేంకటేశ్వరరావు.

ధరిత్రిలో సావిత్రికి చెరగని పేరున్నట్లు
అభినేత్రి సావిత్రిలో మహత్తర కళాశక్తి వుంది—
భారతమంతటా – ఆమెకు తెలియని ప్రదేశమల్లా ప్రాకింది.

గోటేటి శ్రీరామారావు.

సావిత్రిని చూడగానే తెలుగుదనం, అందులోని తియ్య దనాలు గుర్తుకొస్తాయి. తెలుగు కుటుంబాల్లోని సాత్వికమైన స్త్రీ పాత్ర లెన్నింటికో ప్రాణప్రతిష్ఠ చేసి తెలుగు హృదయాల్లో చెరగని ముద్ర వేశారామె.

మోహన్ కుమార్ (జ్యోతిచిత్ర)

సన్మాన్య సావిత్రి

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సోదరి సావిత్రి సన్మానం. ఎంతమంచి వార్తా.

గతాన్ని మరిచి పొమ్మని కొందరు అంటుంటారు. ఎట్లా మరిచి పోవడం?

మరిచి పోవడం అంత సులభమా?

ఆంధ్ర చలన చిత్రరంగ చరత్ర వ్రాస్తే సావిత్రిగారికి ఒక అధ్యాయం కేటాయించాలి. లక్షల జనాన్ని మంత్రముగ్ధులను చేసిన సావిత్రి నటన మరచిపోదామన్నా మరపురాదు. “దేవదాసు”లో సావిత్రి, “నర్తనశాల”లో సావిత్రి, కైకొడుత్తదైవం (తమిళం) లో సావిత్రి – ఎన్ని చిత్రాలలో ఆవిడ నటించి ప్రేక్షకులను అలరించిందో?

కళాభిమానులు విధిగా ఆమెను సన్మానిస్తారు. సన్మానిస్తూనే వుంటారు. ఈనాటికీ, ఏనాటికీ ఆమెనటనను మరవని కళాహృదయులకు, సావిత్రిగారికీ నా అభినందనలు.

కళా ప్రపూర్ణ

డా. దాశరధి

అంధ్రప్రదేశ్ ఆస్థానకవి

పరిశ్రమ గౌరవించే నటి

శ్రీమతి సావిత్రిగార్ని కిన్నెర ఆర్ట్సువారు ఈనాడు సన్మానిస్తున్నారు. ఒక మహా నటికి జరుగుతున్న ఈ గౌరవం మొత్తం పరిశ్రమలో వున్నవాళ్ళంతా పంచుకుంన్నాం. ఎందుకంటే సావిత్రి గారంటే మహానటే కాదు – ఒక కళా సంస్థ – ఆ సంస్థలో మేమంతా సభ్యులం. కళకు ప్రతిరూపమయిన సావిత్రిగార్ని గురించి మాట్లాడాటానికి నేను చాలా చిన్నవాడ్ని. ఎందుకంటే ఆమె గురించి ఏం మాట్లాడినా అతిశయోక్తి అవుతుందేమో !

ఆమె జీవితంలో సుఖ దుఃఖాలు, మంచి చెడూ అన్ని సమానంగా చవిచూశారు- నటిగా అంచెలంచెలు అందుకుంటూ దక్షిణ భారత దేశంలోనేగాక యావద్భారత దేశానంతటికి మహా నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమెకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాయించుకుని, ఈనాటి వరకూ ఆ స్థానం పడనీయకుండా కాపాడుకుంటూ, నిర్మాతగా, దర్శకురాలిగా గూడ ఎంతో పేరుతెచ్చుకుని, అనేక వర్థమాన నటీమణులకు ఆదర్శంగా నిలబడ్డారు.

నేను ఆమెతో కొద్ది చిత్రాలతో నటించినా, అవన్నీ గూడ చిరస్మరణీయంగా జ్ఞాపకం వుంచుకునేటట్టు చేసి, తోటి నటుడుగా ఎంతో ప్రోత్సహించి ఆమెతో నటించడం నాకు అదృష్టం అనిపించేలా చేసారామె. సెట్స్ లోనూ, సెట్స్ బయటా గూడ, చాలా హుషారుగా వూంటూ, జోక్స్ వేస్తూ, ఆవిడకు పర్సనల్ గా ఎన్నిసమస్యలున్నా పైకి ఏమీ తెలియనీయకుండా ప్రవర్తిస్తూ చాల చలాకీగా వున్న ఆర్టిస్టు బహుశా నేను చూసినంతలో ఆమె ఒక్కరే కనిపిస్తున్నారు. సావిత్రి గారంటే పరిశ్రమలో వున్నవారందరికి గౌరవం, అభిమానం, ప్రేమ, సానుభూతి వున్నాయని, నేను గమనించాను – అలా పరిశ్రమ గౌరవించేది కొద్దిమందిని మాత్రమే.

ఆమెను ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ నటరాజు ప్రాసాదించమని ప్రార్థిస్తూ, నాకీ అవకాశం యిచ్చిన కిన్నెర ఆర్ట్స్ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను.

యమ్. చంద్రమోహన్

కళాస్వరూపిణి

కిన్నెర ఆర్టు థియేటర్సు వారికి, సావిత్రి సన్మాన కమిటీవారికి. నమస్కారములు.

శ్రీమతి సావిత్రిగారు నటి గాదు – కళాస్వరూపిణి.

తెలుగువారి ఆడబిడ్డ. అరవవారి కోడలు.

పుట్టినింటినే గాక, మెట్టినిల్లును గూడా తన నటనా విశిష్టతతో ఉఱ్రూతలూగించి, ఏకైక తారగా, ఏకచ్ఛత్రంగా రెండు దశాబ్దాలు పాలించి, అరవ ప్రజా బాహుళ్యంచే “నడిగై తిలకం” అని బిరుదు పొందిన మహా విదుషీమణి.

హిందీ సినీ రంగంలో ధృవతారగా తన నటచ్ఛాయలు బరపిన నట సరస్వతి.

అట్టి మహా నటి సరసన నటించే భాగ్యం కలగడం నా అదృష్టం.

సావిత్రిగారిని “సన్మానించడం కంటే, నట లోకానికి వేరే మహా భాగ్యం ఏమిటి

ఒక్కమాట సావిత్రి సన్మానం అనడం కంటే ఆంధ్ర నాట్య కళామతల్లి కే సన్మాసనం ” అనడం సముచితం.

నాట్యాధిదేవుడైన శ్రీ నటరాజస్వామి, శ్రీమతి సావిత్రిగారికి, ఆమె కుటుంబమునకు దీర్ఝాయురారోగ్య ఐశ్వర్యముల ప్రసాదించి, రక్షించుగాక.

ధూళిపాళ్ళ.

కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారు ప్రముఖ సినీ నటి శ్రీమతి సావిత్రిగారిని సన్మానిస్తున్నారని విని చాలా ఆనందించాను.

దక్షిణ భారత సినీ పరిశ్రమకు ఎనలేని కీర్తిప్రతిష్టలను చేకూర్చిపెట్టిన కొద్దిమంది నటీమణులలో శ్రీమతి సావిత్రి ఒకరు. గత మూడు దశాబ్దాల కాలంలో ఆమె ధరించిన పాత్రలు, వాటిలో ఆమె ప్రదర్శించిన హావభావాలు కొత్తగా చిత్ర పరిశ్రమకు విచ్చేస్తున్న వారికి పాఠ్యాంశాలు అనటంలో అతిశయోక్తి లేదు . చలనచిత్ర చరిత్ర వ్రాస్తే అందులో సావిత్రి గారి అధ్యాయం ప్రత్యేకమైన అధ్యాయం అవుతుంది.

తెలుగు పరిశ్రమకే ఆమె నటన పరిమితం కాకుండా తమిళ రంగంలో కూడా పరిమళాలను వెదజల్లి ఇరు భాషా చిత్రాలకు వన్నెచిన్నెలు చేకూర్చింది.

ఆమె ఉత్తమ నటి మాత్రమే కాదు. అంతకు మించిన ఉత్తమ వ్యక్తి. సాటి నటీనటుల పట్ల ఆమె చూపిన ఆదరాభిమానాలు, ఉన్నత శ్రేణిలో వున్నా అహంభావం అణుమాత్రం కూడా లేకుండా నిర్మాతలపట్ల, నిర్మాణ శాఖలోని ఇతరుల పట్ల చూపిన స్నేహశీలత చిత్ర పరిశ్రమకే ఆదర్శప్రాయమైంది.

నా ఉద్దేశ్యంలో మన దేశంలో అద్వితీయమైన నటీమణులు మగ్గురు. వారు కీర్తిశేషులు శ్రీమతి మీనాకుమారి, బెంగాలి నటి శ్రీమతి సుచిత్రాసేన్, మన ఆడపడుచు శ్రీమతి సావిత్రిగారలు. ఒక్క మాటలో చెప్పాలంటే కళామతల్లి నుదుట తీర్చిదిద్దిన తిలకం శ్రీమతి సావిత్రి.

కాలం మారుతోంది. కాలంతో పాటే మనుష్యులూ మారుతున్నారు. అన్ని రంగాలలో లాగే చిత్రరంగంలో కూడా అనూహ్యమైన మార్పులు వచ్చాయి – వస్తున్నాయి. నేను నిరాశావాదిని కాదనుకొంటె కొన్ని నిజాలు చెప్పకతప్పదు. చిత్ర పరిశ్రమలో మానవత్వపు విలువలు తరిగి, డబ్బుకు విలువ పెరిగింది. డబ్బుకు విలువ ఎప్పుడూ వుంది. కాని ఈనాడు కేవలం డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత.

కాని ఈ స్థితిలో కిన్నెర ఆర్ట్స్ వారు శ్రీమతి సావిత్రిగార్కి సన్మానం చేసి ఇంకా మానవత్వపు విలువల్ని, ఉత్తమ కళాకురుల్ని గౌరవించేవారు ఉన్నారని నిరూపించారు. అదే నా ఆనందానికి మూలం.

గుమ్మడి వెంకటేశ్వరరావు

సంస్కారమున్న నటి
కిన్నెర ఆర్ట్ ధియేటర్సు వారు “నటీ శిరోమణి” సావిత్రి గార్కి సన్మానం చేస్తున్నారని విని ఆనందపడే వారిలో నెనొకడిని. నేనేకాదు ఆనంద పడనివారు ఒక్కరుకూడా వుండరనటంలో సందేహములేదు. సావిత్రి అన్న పేరు ఆమెకు సంబంధించి నంతవరకు నా వుద్దేశ్యములో “సర్వస్వతి ఆమెలో మూడు వీధాల విరించివున్నది. ఒకటి టాలెంటు (నటనాశక్తి)”, రెండు అవిరళకృషి, మూడు సంస్కారము. మహా నటీనటులుండవచ్చు. సంస్కారమున్న నటీనటులు చాల అరుదు. అటువంటి మహానటికి యీ పాటికి ఎన్నో సన్మనాలు, గౌరవాలు జరిగివుండ వలసింది. జరుగలేదేమో, జరుపలేదేమో అన్న బాధ ప్రతి ఒక్కరిలోవుంది. అటువంటి తరుణంలో కనీసం మీరైనా పూనుకొని ఆమెను గౌరవించటంచూస్తే ప్రతిభకు స్దానం, గౌరవం చావలేదు అని నిరూపిస్తున్నట్లు. ఒక ఆశాజ నితమైన వాతావరణం సృష్టిస్తున్నట్లు వుంది. అటువంటి మహానటిని సన్మానిస్తున్న మీకు నా ధన్యవాదాలు. అటువంటి మహానటీనటులకు సన్మానం చెయ్యాలి – అనర్హులకుకాదు – అన్న మీ భావన, మీ పూనిక యితర సంస్దలకు ఆదర్శం కావాలని కోరుకుంటూ, ఆ మహానటికి నా హృదయపూర్వక సంతోషాన్ని తెల్పుకుంటూ, హృదయ పూర్వక వందనాలు సమర్పిస్తూ, మీ యీ ఫంక్షను జయప్రదం కావాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

కె. సత్యనారాయణ

Back

Lingual Support by India Fascinates